
పీజీఆర్‌ఎస్‌కు 351 అర్జీలు
కాకినాడ సిటీ: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్‌ఎస్) కార్యక్రమంలో ప్రజలు 351 అర్జీలు సమర్పించారు. వారి నుంచి జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్‌ఓ) జె.వెంకటరావు, ట్రైనీ కలెక్టర్ జె.మనీషా, హౌసింగ్ పీడీ ఎన్‌వీవీ సత్యనారాయణ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రామలక్ష్మి, సీపీఓ త్రినాథ్, బీసీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాసరావు అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా డీఆర్‌ఓ మాట్లాడుతూ, ప్రజల నుంచి అందిన అర్జీలకు సంబంధిత అధికారులు సమగ్రమైన, సంతృప్తికరమైన పరిష్కారాలను త్వరితగతిన అందించాలని అన్నారు. వచ్చిన అర్జీలను పీజీఆర్‌ఎస్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేసి, అర్జీదారులకు రశీదులు అందజేయాలని సూచించారు.
రత్నగిరిపై భక్తుల సందడి
అన్నవరం: వేలాదిగా వచ్చిన భక్తులతో రత్నగిరి సోమవారం కిటకిటలాడింది. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు సత్యదేవుని ఆలయానికి చేరుకున్నారు. ఉచిత దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట పట్టింది. సత్యదేవుని దర్శించిన అనంతరం భక్తులు సప్తగోకులంలో గోవులకు ప్రదక్షిణ చేసి, రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించారు. స్వామివారిని 30 వేల మంది దర్శించుకున్నారు. వ్రతాలు 1,400 నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో సుమారు 5 వేల మంది భక్తులు సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి, శంకరులు సోమవారం ముత్యాల కవచాల అలంకరణలో (ముత్తంగి సేవ) భక్తులకు దర్శనమిచ్చారు.
వరదలపై నేడు సమావేశం
ధవళేశ్వరం: రానున్న గోదావరి వరదలను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు ధవళేశ్వరంలోని ఇరిగేషన్ కార్యాలయంలో మంగళవారం ఉదయం 11 గంటలకు ఫ్లడ్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇరిగేషన్ సర్కిల్ ఎస్‌ఈ గోపీనాథ్ సోమవారం ఈ విషయం తెలిపారు. వరదల నేపథ్యంలో తీసుకోవాల్సిన రక్షణ పనులకు సంబంధించి సమగ్ర సమాచారంతో సంబంధిత ఇరిగేషన్ అధికారులు ఈ సమావేశానికి హాజరు కావాలని సూచించారు.

పీజీఆర్‌ఎస్‌కు 351 అర్జీలు