
రైతులకు అండగా ఉండండి
అధికారులతో మంత్రి మనోహర్
కాకినాడ సిటీ: అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు అండగా నిలవాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మిల్లర్లు, అధికారులను కోరారు. సోమవారం కలెక్టరేట్‌లో మంత్రి కాకినాడ, బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల ప్రజాప్రతినిధులు, జాయింట్ కలెక్టర్లు, రైస్ మిల్లర్లతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడుతూ ఆదివారం కురిసిన వర్షాల వల్ల ధాన్యం తడిసి రైతులు ఆందోళన చెందుతున్న విషయాన్ని వివరించారు. కాకినాడ జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రగతిని జాయింట్ కలెక్టర్ రాహుల్‌మీనా వివరించినప్పుడు ట్రాన్స్‌పోర్టు కోసం ఉపయోగించే ట్రైలర్ల సర్టిఫికేషన్‌కు తీవ్ర జాప్యం జరుగుతోందని ఎమ్మెల్యేలు తెలిపారు. రవాణాశాఖ అధికారులతో చర్చించి పరిష్కరిస్తామని కలెక్టర్ షణ్మోహన్ వివరించారు. బొండాలు రకం బాయిల్డ్‌రైస్ సేకరణకు ఎఫ్‌సీఐ అనుమతి కోరామన్నారు. అనుమతి వచ్చే లోపు కొనుగోళ్లు కొనసాగించాలని పౌరసరఫరా సంస్థ ఎండీ మనజీర్ జిలానిసామూల్ మిల్లర్లను కోరారు. ఎఫ్‌సీఐలో మాన్యుయల్ గ్రెయిన్ ఎనాలసిస్ వల్ల రిజెక్షన్ ఎక్కువగా ఉంటున్నందున ఆటోమేటిక్ అనాలసిస్ అమలు చేసేలా చూడాలని కోరారు. కోనసీమ జిల్లా సమీక్షలో వివిధ మండలాల్లో పంట కోతల సమయాల్లో తేడాలు ఉన్నందున రైతు సేవా కేంద్రాల టార్గెట్‌లను అడ్జస్ట్ చేయాలని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కోరగా గతంలో ఉమ్మడి జిల్లాలో కొనుగోలు నిర్వహించిన డ్వాక్రా సంఘాలకు పెండింగ్ ఉన్న సుమారు. రూ.16.75 లక్షల కమీషన్ చెల్లింపునకు సంబంధించి మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు కోరారు. గోకవరం మండలంలో రైస్ మిల్లులు లేవని, కొనుగోళ్లకు ప్రత్యేక ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కోరారు. మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రైతులు నష్టపోకుండా తడిసిన ధాన్యం అంతా కొనుగోలు చేస్తామన్నారు. ధాన్యం నెమ్ము 22 శాతం వరకూ ఉన్నా కొనుగోళ్లు జరపాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అన్ని జిల్లాల్లో ఇకపై బ్యాంకు గ్యారంటీని ప్రామాణికంగా 1:2 నిష్పత్తిగా అమలు చేస్తామని మంత్రి నాదెండ్ల తెలియజేశారు. మూడు జిల్లాల్లో సీఎంఆర్ టార్గెట్‌ను పెంచామని చెప్పారు. కాకినాడ జిల్లాకు 50 వేల టన్నులు బొండాల రకం, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు లక్ష టన్నులు, తూర్పుగోదావరి జిల్లాకు ఇప్పటికే పెంచిన 30 వేలకు అదనంగా మరో 50వేల టన్నులు టార్గెట్‌ను పెంచుతున్నామని మంత్రి వివరించారు.