
మహాశివరాత్రి ఆదాయం రూ 29.66 లక్షలు
సామర్లకోట: మహాశివరాత్రి సందర్భంగా స్థానిక పంచారామ క్షేత్రమైన బాలాత్రిపుర సుందరీ సమేత కుమారారామ భీమేశ్వరస్వామి ఆలయానికి రూ.29,66,406 ఆదాయం సమకూరిందని ఈఓ బళ్ల నీలకంఠం తెలిపారు. గత ఏడాది డిసెంబర్ 6 నుంచి మార్చి 20 వరకూ ఆలయంలో హుండీల ద్వారా వచ్చిన ఆదాయాన్ని గురువారం లెక్కించారు. హుండీల ద్వారా రూ.16,15,788 ఆదాయం వచ్చిందని ఈఓ తెలిపారు. 67 గ్రాముల బంగారు, 600 గ్రాముల వెండి వస్తువులు లభించాయని ఈఓ తెలిపారు. ఫిబ్రవరి 24 నుంచి మార్చి 1 వరకూ దర్శనం టిక్కెట్ల ద్వారా రూ.7,05,960, వివిధ సేవా టిక్కెట్ల ద్వారా రూ.65,747, ప్రసాద విక్రయాల ద్వారా రూ.2,66,215, అన్నదాన విరాళాలు రూ.3,12,696 వచ్చాయని వివరించారు. హుండీల ద్వారా గత ఏడాది కంటే రూ.6 లక్షలు అదనంగా ఆదాయం వచ్చిందని ఈఓ తెలిపారు. దేవదాయ శాఖ తనిఖీదారు ఫణికుమార్ పర్యవేక్షణలో హుండీల లెక్కింపు జరిగింది. ఉత్సవ కమిటీ చైర్మన్ కంటే బాబు, ఆలయ సూపరింటెండెంట్ ఈశ్వరరావు, మానవ హక్కుల సంఘం అధ్యక్షుడు నూతలపాటి అప్పలకొండ, ఆర్యవైశ్య సంఘం, భక్త సంఘం, ఉండూరు లక్ష్మీనారాయణ సేవా సంఘం సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు.
ఈవీఎంల భద్రతకు
పటిష్ట చర్యలు
కాకినాడ సిటీ: ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం), వీవీ ప్యాట్‌ల భద్రతకు పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ వద్ద ఉన్న ఈవీఎం గోదామును ఆయన గురువారం పరిశీలించారు. అక్కడి భద్రతా చర్యలు అడిగి తెలుసుకున్నారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి నెలా ఈవీఎంల గోదామును పరిశీలించి, నివేదిక పంపిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. అలాగే, ప్రతి మూడు నెలలకోసారి జిల్లాలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో గోదామును పరిశీలిస్తున్నామన్నారు. కార్యక్రమంలో డీఆర్వో జె.వెంకటరావు, జిల్లా అగ్నిమాపక అధికారి పీవీఎస్ రాజేష్, కాకినాడ అర్బన్ తహసీల్దార్ వి.జితేంద్ర, కలెక్టరేట్ ఎన్నికల విభాగం డీటీ ఎం జగన్నాధం, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.