
కొత్త కోవెల @ 13 వసంతాలు
● నేడు 14వ సంవత్సరంలోకి అడుగు
● సత్యదేవునికి ఘనంగా పూజలు
● 2011లో నూతన ఆలయ నిర్మాణం
అన్నవరం: భక్తవరదుడైన సత్యదేవుని నూతన ఆలయం 13 వసంతాలు పూర్తి చేసుకొని శుక్రవారం 14వ వత్సరంలోకి అడుగిడుతోంది. ఈ సందర్భంగా రత్నగిరి ఘనంగా వేడుకలు నిర్వహించనున్నారు. సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేయనున్నారు.
సత్యదేవుని ఆవిర్భావం
శతాబ్దానికి పైబడిన చరిత్ర సత్యదేవుని సొంతం. అప్పటికి అన్నవరం ఓ కుగ్రామం. ఆ రోజుల్లో రత్నగిరిపై దట్టమైన అడవి ఉండేది. 1891లో ఖర నామ సంవత్సర శ్రావణ శుద్ధ విదియ ముందు రోజు రాత్రి అప్పటి గోర్స ఎస్టేట్ జమీందార్ అయిన రాజా ఇనుగంటి వేంకట రామారాయణం కలలో సత్యదేవుడు ప్రత్యక్షమయ్యారు. తాను అన్నవరంలోని రత్నగిరిపై వెలిశానని, తనకు ఆలయం కట్టించాలని చెప్పారు. అన్నవరం గ్రామానికి చెందిన ఈరంకి ప్రకాశరావుకు కూడా ఇదేవిధంగా కల వచ్చింది. దీంతో వారిద్దరు, మరికొంత మంది గ్రామస్తులు కలిసి రత్నగిరిపై సత్యదేవుని కోసం వెతికారు. అన్నవరం గ్రామ దేవత నేరేళ్లమ్మ తల్లి ఆలయం పక్కన ఉన్న కొండ మీద అంకుడు చెట్టు కింద స్వామివారి విగ్రహం దర్శనమిచ్చింది. దీంతో తొలుత చిన్న పందిరి నిర్మించి ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆ తరువాత చిన్న ఆలయం, మరి కొన్నాళ్లకు పెద్ద ఆలయాన్ని రెండంతస్తుల్లో నిర్మించారు. కింది అంతస్తులో మహా నారాయణ యంత్రాన్ని విష్ణు పంచాయతనంతో ప్రతిష్ఠించారు. మధ్యలో సత్యదేవుడు, ఎడమ వైపు అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారు, కుడివైపు లింగాకారంలో పరమేశ్వరుడు ఈ ఆలయంలోనే 2011 వరకూ భక్తులకు భక్తులకు దర్శనమిచ్చారు.
నూతన ఆలయ నిర్మించారిలా..
పాత ఆలయం శిథిలావస్థకు చేరడంతో నూతన ఆలయాన్ని నిర్మించాలని 2011లో అప్పటి కార్యనిర్వహణాధికారి, ప్రస్తుత దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ సంకల్పించారు. దీనికి అప్పట్లో చాలా అడ్డంకులు ఎదురయ్యాయి. కొంతమంది పాత ఆలయం తొలగించడానికి వీలు లేదని హైకోర్టును, సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఫలితం దక్కలేదు. నూతన ఆలయ నిర్మాణం సుమారు ఏడాది పాటు సాగింది. మూలవిరాట్టులపై టేకు చెక్కతో తయారు చేసిన పెద్ద పెట్టెను ఉంచి, దానిపై ఇనుప గడ్డర్లతో రక్షణ ఏర్పాటు చేసి, పాత ఆలయాన్ని తొలగించారు. తమిళనాడులోని నమ్మక్కల్ గ్రానైట్ క్వారీల నుంచి సేకరించిన శిలలతో పాత ఆలయం మాదిరిగానే రెండంతస్తుల్లో నూతన ఆలయ నిర్మాణం జరిగింది. ఈ నిర్మాణం జరిగినన్నాళ్లూ సత్యదేవుడు, అమ్మవారు, శంకరుల ఉత్సవ మూర్తులను ధ్వజస్తంభం వద్ద బాలాలయంలో ఉంచి పూజలు నిర్వహించారు.
జయేంద్ర సరస్వతి చేతుల మీదుగా..
నూతన ఆలయ శిఖరంపై కలశ స్థాపన కార్యక్రమాన్ని 2012 మార్చి 14, ఫాల్గుణ బహుళ సప్తమి నాడు కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు జయేంద్ర సరస్వతి స్వామి చేతుల మీదుగా శాస్త్రోక్తంగా నిర్వహించారు. అప్పటి నుంచి తెలుగు తిథుల ప్రకారం ఏటా ఫాల్గుణ బహుళ సప్తమి నాడు నూతన ఆలయ వార్షికోత్సవం నిర్వహిస్తున్నారు.
నేడు ప్రత్యేక పూజలు
నూతన ఆలయ వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం తెల్లవారుజామున సత్యదేవుడు, అమ్మవారికి, శంకరులకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. బూరెలు, పులిహోర, రవ్వకేసరి ప్రసాదాలు నివేదించి, భక్తులకు పంపిణీ చేస్తారు. అలాగే, స్వామివారి కదంబ ప్రసాదం కూడా పంపిణీ చేస్తారు. వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని స్వామివారి ఆలయాన్ని, ఆలయ ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా అలంకరిస్తున్నారు.
అటకెక్కిన ‘స్వర్ణ’ ప్రాజెక్ట్
సత్యదేవుని ఆలయ శిఖరానికి బంగారు రేకు తాపడం చేయాలనే ప్రతిపాదన ఆరు నెలలుగా కాగితాలకే పరిమితమైంది. ఈ ప్రతిపాదనపై అంచనాలు రూపొందించాలని గత ఏడాది టీటీడీని కోరారు. దీనికి 50 కిలోలకు పైగా బంగారం అవసరమవుతుందని టీటీడీ నిపుణులు ప్రాథమిక నివేదిక సమర్పించారు. ప్రస్తుతం బంగారం ధరతో పోల్చితే ఇది దేవస్థానానికి సాధ్యం కాదు. దీంతో రాగి రేకుపై బంగారు కోటింగ్‌తో చేయించేందుకు నివేదిక ఇవ్వాలని అప్పటి ఈఓ కె.రామచంద్ర మోహన్ కోరారు. ఆయన గత నవంబర్‌లో కమిషనర్ కార్యాలయానికి బదిలీ అయ్యాక దీనిని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఇప్పటికై నా దీనిపై చర్యలు తీసుకుని, దాతల విరాళాలతో ఆలయ శిఖరాన్ని స్వర్ణ రేకు తాపడం చేయించాలని భక్తులు కోరుతున్నారు.

కొత్త కోవెల @ 13 వసంతాలు

కొత్త కోవెల @ 13 వసంతాలు