నాడు ఎత్తేసి.. నేడు తొక్కేసి.. | - | Sakshi
Sakshi News home page

నాడు ఎత్తేసి.. నేడు తొక్కేసి..

Mar 16 2025 12:08 AM | Updated on Mar 16 2025 12:08 AM

నాడు ఎత్తేసి.. నేడు తొక్కేసి..

నాడు ఎత్తేసి.. నేడు తొక్కేసి..

సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఆరు నెలలు సావాసం చేస్తే వారు, వీరు ఒక్కటవుతారంటారు. కూటమిగా జత కట్టి.. అమలు కాని హామీలతో ప్రజలను నమ్మించి.. నట్టేట ముంచుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ల విషయంలో ఈ మాట నిజమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అవసరానికి వాడుకుని, పని అయిపోయాక కూరలో కరివేపాకులా తీసి పడేసే తత్వం ఇంత కాలం చంద్రబాబుకే సొంతమనుకునే వారు. ఇప్పుడు చంద్రబాబుతో చెట్టపట్టాలేసుకు తిరుగుతున్న పవన్‌ కల్యాణ్‌, ఆయన సోదరుడు నాగబాబు కూడా ఆ తత్వాన్ని ఒంట పట్టించుకున్నట్టు కనిపిస్తోంది. పిఠాపురం శివారు చిత్రాడలో శుక్రవారం రాత్రి జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో పవన్‌ సోదరుడు, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు చేసిన వ్యాఖ్యలే దీనికి అద్దం పడుతున్నాయి. ‘పిఠాపురంలో పవన్‌ కల్యాణ్‌ గెలుపులో ప్రధానంగా రెండు ఫ్యాక్టర్స్‌ పని చేశాయి. ఒకటి జనసేన ప్రెసిడెంట్‌ పవన్‌ కల్యాణ్‌. రెండు జనసైనికులు, పిఠాపురం ఓటర్లు’ మరెవరైనా పవన్‌ గెలుపులో తమ పాత్ర ఉందని అనుకుంటే అది వారి ఖర్మ’ అని నాగబాబు నొక్కి మరీ చెప్పారు. ఆ మాటలకు అర్థాలే వేరని ఆ సభలోనే జనసేన అభిమానులు, కార్యకర్తలు గుసగుసలాడటం వినిపించింది. నాగబాబు చేసిన వ్యాఖ్యలు పిఠాపురానికి చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మను ఉద్దేశించినవేనని ఆయన అనుచరులు, టీడీపీ కార్యకర్తలు బల్లగుద్ది మరీ చెబుతున్నారు.

పొగిడిన నోటితోనే..

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ 2019 సార్వత్రిక ఎన్నికల్లో గాజువాక, భీమవరంలో పోటీ చేసి, రెండుచోట్లా ఓడిపోయారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన ఒకే ఒక్క స్థానం పిఠాపురంలో గెలుపొందారు. ఈ గెలుపులో జనసేన ఎంత పని చేసిందో, స్థానిక టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ, ఆయన అనుచరగణం కూడా అంతే స్థాయిలో పని చేసిందనేది జగమెరిగిన సత్యం. పరాజయాల నేపథ్యంతో గత సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురాన్ని ఎంపిక చేసుకున్నప్పటి నుంచి, గెలుపొందే వరకూ వర్మను ఇంద్రుడు, చంద్రుడు అంటూ ఆకాశానికెత్తేయడంలో మెగా బ్రదర్స్‌ పవన్‌ కల్యాణ్‌, నాగబాబు పోటీ పడ్డారు. ‘ఈ విజయం జనసైనికులది. ఈ విజయం వర్మది’ అంటూ స్వయంగా పవన్‌ కల్యాణ్‌ పలు సభల్లో వర్మను ప్రశంసలతో ముంచెత్తారు. సార్వత్రిక ఎన్నికల ముందు వరకూ అన్నదమ్ములిద్దరూ వర్మను నెత్తిన పెట్టుకున్నారు. అధికారంలో భాగస్వామ్యులై, పవన్‌ ఉప ముఖ్యమంత్రి అయ్యాక అసలు స్వరూపం బయటపడిందని, వర్మను రాజకీయంగా పాతాళానికి తొక్కేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన అనుచర వర్గం మండిపడుతోంది.

విస్తృతంగా చర్చ

నేడు మెగాబ్రదర్స్‌ వ్యాఖ్యలు చూస్తూంటే ‘ఓడ ఎక్కే వరకూ ఓడ మల్లన్న.. ఒడ్డుకు చేరాక బోడి మల్లన్న’ సామెతను తలపిస్తోందని అంటున్నారు. సార్వత్రిక ఎన్నికలయ్యేంత వరకూ వర్మను వేనోళ్ల పొగడిన మెగా సోదరులు ఇంతలోనే ఇంతలా మారిపోతారని ఊహించలేదని తెలుగు తమ్ముళ్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలప్పుడు పిఠాపురంలో జరిగిన ఒక సభలో వర్మను ఆకాశానికెత్తేస్తూ మెగా బ్రదర్స్‌ పొగుడుతున్న వీడియో, శుక్రవారం రాత్రి చిత్రాడ సభలో నాగబాబు వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. ఈ అంశం ఇప్పుడు కూటమి పార్టీల మధ్య హాట్‌టాపిక్‌గా మారింది. ఎక్కడ ఏ నలుగురు కలిసినా ఇదే విషయంపై చర్చించుకుంటున్నారు. పవన్‌ కల్యాణ్‌ తరచూ మార్పు రావాలంటున్నారని, చివరకు చిత్రాడ సభలో సైతం ఇదే విషయాన్ని ఊదరగొట్టారని, మార్పు అంటే ఇదేనా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

చంద్రబాబు మొండిచేయి

పొత్తు ధర్మంలో భాగంగా పిఠాపురం సీటు త్యాగం చేసిన వర్మకు చంద్రబాబు భారీ హామీయే ఎర వేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక తొలి ఎమ్మెల్సీ పదవిని ఆయనకే ఇస్తామని గొప్పగా ప్రకటించారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత రెండుమూడు దఫాలు ఎమ్మెల్సీల నియామకాలు జరిగినా వర్మకు మాత్రం మొండిచేయే చూపించారు. పని అయ్యే వరకూ బుజ్జగించడం.. ఆనక గాలికొదిలేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అనే విమర్శ ఉంది. అయితే, అదే వాస్తవమని వర్మకు ఎమ్మెల్సీ పదవి విషయంలో మరోసారి రుజువైందని అంటున్నారు. అయితే, వర్మకు జెల్ల కొట్టడానికి వేరే కారణముందనే చర్చ కూడా నడుస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో సీటు ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ వర్మ అనుచరులు పిఠాపురంలో చంద్రబాబు, లోకేష్‌ దిష్టిబొమ్మలు, పార్టీ జెండాలు దహనం చేశారు. చంద్రబాబు, లోకేష్‌లను బూతులు తిట్టారు. దీనిని మనసులో పెట్టుకుని, చంద్రబాబు, లోకేష్‌లు వ్యూహాత్మకంగానే వర్మను తొక్కేస్తున్నారని, మెగాబ్రదర్స్‌ ద్వారా పొమ్మనకుండానే పొగ పెడుతున్నారని టీడీపీలోని ఒక వర్గం అంటోంది. లేకుంటే వర్మను నాగబాబు పదేపదే టార్గెట్‌ చేస్తున్నా అధినేతలు ఎందుకు మాట్లాడటం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి మాజీ ఎమ్మెల్యే వర్మ, నాగబాబు మధ్య ఎన్నికల సమయంలో రగిలిన చిచ్చు అధికారంలోకి వచ్చాక కూడా కొనసాగుతూనే ఉంది. ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు వర్మకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వకపోగా.. ఆయనను నిత్యం విభేదించే మెగా బ్రదర్‌ నాగబాబుకు ఆ పదవి ఇచ్చారు. నాగబాబును రేపోమాపో మంత్రిని కూడా చేస్తారనే ప్రచారంతో పిఠాపురంలో వర్మ అనుచరులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. పరిస్థితి ఇలానే కొనసాగితే నియోజకవర్గంలో టీడీపీ ఉనికే ప్రమాదంలో పడుతుందని తెలుగు తమ్ముళ్లు పేర్కొంటున్నారు.

మొన్నటి వరకూ పొగిడారు..

ఇప్పుడు పొగ పెడుతున్నట్టున్నారు సార్‌..

కూరలో కరివేపాకులా

మాజీ ఎమ్మెల్యే వర్మ పరిస్థితి

నాగబాబు ‘ఖర్మ’ కామెంట్లపై

తమ్ముళ్ల ఆగ్రహం

వర్మనుద్దేశించే అన్నారని మండిపాటు

ఇదంతా చంద్రబాబు

వ్యూహమని ప్రచారం

పొమ్మనకుండా పొగ పెడుతున్నారంటున్న

టీడీపీలోని ఒక వర్గం

పిఠాపురంలో ‘దేశా’నికి ‘చంద్ర’ గ్రహణం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement