అన్నవరం: ఫాల్గుణ పౌర్ణమి, హోలీ పర్వదినం సందర్భంగా రత్నగిరి వాసుడు సత్యదేవుని ఆలయం శుక్రవారం వేలాదిగా వచ్చిన భక్తులతో కిటకిటలాడింది. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం, వ్రత, విశ్రాంతి మండపాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. సుమారు 30 వేల మంది స్వామివారిని దర్శించుకున్నారు. రెండు వేల వ్రతాలు నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం సమకూరింది. సత్యదేవుని దర్శించుకున్న భక్తులు సప్తగోకులంలో గోవులకు ప్రదక్షిణ చేశారు. శ్రీకృష్ణుడిని దర్శించుకున్నారు. అలాగే, రావిచెట్టుకు కూడా ప్రదక్షిణలు చేసి, జ్యోతులు వెలిగించారు. నిత్యాన్నదాన పథకంలో సత్యదేవుని అన్న ప్రసాదాన్ని 5 వేల మంది స్వీకరించారు. సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లను శనివారం ఉదయం 10 గంటలకు తిరుచ్చి వాహనంపై ఆలయ ప్రాకారంలో మూడుసార్లు ఊరేగించనున్నారు.
వైభవంగా చక్రస్నానం
మధురపూడి: కోరుకొండ శ్రీలక్ష్మీ నరసింహస్వామి కల్యాణోత్సవాల్లో భాగంగా శుక్రవారం చక్రస్నానం ఘనంగా నిర్వహించారు. నరసింహస్వామితో పాటు అనంత పద్మనాభస్వామి, చక్రపెరుమాళ్ల స్వామి వార్లకు స్థానిక స్వామి వారి కోనేటిలో ఈ ఉత్సవం జరిపారు. రాత్రి 9 గంటలకు స్వామివారికి శేష వాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు. దేవస్థానం వద్ద ప్రారంభమైన ఈ కార్యక్రమం గ్రామంలోని ప్రధాన వీధుల్లో కొనసాగింది. దేవస్థానం చైర్మన్ పరాశర రంగరాజభట్టర్, అన్నవరం దేవస్థానం అధికారులు, పండితులు, అర్చక స్వాములు పాల్గొన్నారు.
నేటితో ఉత్సవాల ముగింపు
లక్ష్మీనరసింహస్వామివారి కల్యాణ మహోత్సవాలు శనివారంతో ముగియనున్నాయి. ఈ నెల 9న ఇవి ప్రారంభమైన విషయం తెలిసిందే. చివరి రోజు శ్రీపుష్పయాగం నిర్వహిస్తారు.
డెల్టాలకు నీరు విడుదల
ధవళేశ్వరం: కాటన్ బ్యారేజీ నుంచి గోదావరి డెల్టా కాలువలకు శుక్రవారం 10,250 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. ఇందులో తూర్పు డెల్టాకు 3,050, మధ్య డెల్టాకు 2 వేలు, పశ్చిమ డెల్టాకు 5,200 క్యూసెక్కుల చొప్పున వదిలారు. బ్యారేజీ వద్ద నీటిమట్టం 10.20 అడుగులు ఉంది.
రత్నగిరికి భక్తుల తాకిడి