
ప్రజా సంక్షేమమే ధ్యేయం
●
● జిల్లాలో ఘనంగా వైఎస్సార్ సీపీ
ఆవిర్భావ దినోత్సవం
● కేక్ కట్ చేసి, జెండా
ఆవిష్కరించిన నేతలు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన పోరాడే పార్టీగా వైఎస్సార్ సీపీ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది. పార్టీ ఆవిర్భవించి ఒకటిన్నర దశాబ్దాల కాలం గడిచినా కులాలు, మతాలు, వర్గాలకు అతీతంగా ప్రతి ఒక్కరి గుండె చప్పుడై నిలుస్తోంది. నిరంతరం ప్రజల పక్షాన నిలుస్తున్న వైఎస్సార్ సీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని జిల్లావ్యాప్తంగా ప్రజలు బుధవారం పండగలా నిర్వహించారు.
● జిల్లా కేంద్రం కాకినాడలోని పార్టీ సిటీ కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఆధ్వర్యాన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. తొలుత మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా సహా ముఖ్య నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్సార్ ఆశయాలకు అనుగుణంగా బడుగు, బలహీన వర్గాలు, నిరుపేదల సంక్షేమమే అజెండాగా వైఎస్సార్ సీపీ పని చేస్తోందని ఈ సందర్భంగా నేతలు అన్నారు. పేదల గుండె చప్పుడు వైఎస్సార్ సీపీ అని అన్నారు. ప్రజల పక్షాన నిరంతరం పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని పునరుద్ఘాటించారు.
● పిఠాపురంలో వైఎస్సార్ సీపీ కార్యాలయం వద్ద మాజీ ఎంపీ, నియోజకవర్గ కో ఆర్డినేటర్ వంగా గీత పార్టీ జెండా ఎగురవేసి, నాయకులు, కార్యకర్తలకు స్వీట్లు పంచారు. జగ్గంపేటలోని పార్టీ కార్యాలయం వద్ద వైఎస్సార్ సీపీ జెండాను నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ మంత్రి తోట నరసింహం ఎగురవేశారు. కార్యకర్తలకు స్వీట్లు పంచారు. పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోటలోని కార్యాలయం వద్ద నియోజకవర్గ కో ఆర్డినేటర్ దవులూరి దొరబాబు పార్టీ జెండా ఆవిష్కరించారు. కేక్ కట్ చేసి నాయకులు, కార్యకర్తలకు పంచారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో కో ఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు తొలుత వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండా ఎగురవేశారు. తుని శ్రీరామా సెంటర్‌లో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ ఏలూరి సుధారాణి పూలమాల వేసి నివాళులర్పించారు. వైఎస్సార్ సీపీ జెండా ఆవిష్కరించి, కేక్ కట్ చేశారు. నాయకులు, కార్యకర్తలు జై జగన్ నినాదాలతో హోరెత్తించారు. కాకినాడ రూరల్ పార్టీ కార్యాలయంలో సీనియర్ నాయకుడు కురసాల సత్యనారాయణ ఆధ్వర్యాన ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. పార్టీ జెండాను ఆవిష్కరించి, జై జగన్, జై వైఎస్సార్ సీపీ అంటూ నినాదాలు చేశారు.
ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, మాజీ ఎమ్మెల్యే
నాగులాపల్లి ధనలక్ష్మి, మాజీ ఎమ్మెల్సీ అంగులూరి లక్ష్మీ శివకుమారి, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్‌పర్సన్ పెదపాటి అమ్మాజీ, పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు వర్ధినీడి సుజాత, పార్టీ కాకినాడ సిటీ అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న సాగర్, కాకినాడ నగరాభివృద్ధిసంస్థ మాజీ చైర్‌పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, జెడ్పీటీసీ సభ్యుడు గుబ్బల తులసి కుమార్, నేతలు యనమల కృష్ణుడు, వాసిరెడ్డి జమీలు, ఒమ్మి రఘురాం, అల్లి రాజబాబు, ముదునూరి మురళీ కృష్ణంరాజు, మాజీ మేయర్ పోలసపల్లి సరోజ తదితరులు పాల్గొన్నారు.