స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికల నిర్వహణ
గద్వాల క్రైం: తొలి విడత సర్పంచ్ ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావారణంలో నిర్వహిస్తామని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం ఎస్పీ కార్యాలయంలో సిబ్బందితో సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడారు. గద్వాల, ధరూర్, కేటీదొడ్డి, గట్టు మండలాల్లోని ఎన్నికల నిర్వహణలో జిల్లా పోలీసు బలగాలతో పట్టిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి మండలానికి ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారితో ఎప్పటికప్పుడు నివేదికలు, రూట్ మొబైల్స్, క్విక్ రియాక్షన్, స్ట్రయికింగ్ ఫోర్సు, ప్రత్యేక బలగాలను రంగంలోకి దింపామన్నారు. 106 గ్రామ పంచాయతీలో 14 ఏకగ్రీవం కాగా 92 గ్రామ పంచాయతీల్లో 35 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి సీసీ కెమెరాల పర్యవేక్షణలో భద్రతా చర్యలు చేపట్టామన్నారు. గత ఎన్నికల్లో ఏఏ పోలింగ్ కేంద్రాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయో అక్కడ ప్రస్తుతం అదనపు బలగాలను ఏర్పాటు చేశామని, అన్ని పార్టీల నాయకులు, ప్రజలు పోలీసు శాఖకు సహకరించాలన్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామన్నారు. సమా వేశంలో ఏఎస్పీ శంకర్, డీఎస్పీ మొగిలయ్య, సీఐలు శ్రీను, రవి, నాగేశ్వరెడ్డి తదితరులు ఉన్నారు.


