సజావుగా పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ
గద్వాల: పంచాయతీ ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న అధికారులు, సిబ్బంది తమ సొంత మండలాల్లో ఓటుహక్కు వినియోగించుకునేందుకు చేపట్టిన పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను సజావుగా నిర్వహించాలని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. సోమవారం ధరూరు, కేటీదొడ్డి మండలాల్లో పోస్టల్ బ్యాలెట్, ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలను పరిశీలించారు. మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో విధులు నిర్వర్తించే సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ కోసం ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారనే వివరాలను తెలుసుకున్నారు. హెల్ప్‌డెస్క్ వద్ద సిబ్బందితో కలెక్టర్ మాట్లాడి సూచనలు చేశారు. పోస్టల్ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకొని వినియోగించుకోని వారి వివరాలతో పాటు ఎంతమంది వినియోగించుకున్నారనే వివరాలను పక్కాగా నమోదు చేయాలని ఆదేశించారు. ఆయా గ్రామపంచాయతీల ఓటరు జాబితాలో పోస్టల్ బ్యాలెట్ వేసేందుకు వచ్చిన వారి వివరాలు సరిచూసుకోవాలని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ బాక్సుకు రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో సీల్ వేయాలన్నారు. ఎలక్ట్రోరల్ తప్పనిసరిగా పర్యవేక్షించాలని సూచించారు. అనంతరం కేటీదొడ్డి మండల కేంద్రంలో పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పకడ్బందీగా పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ చేపట్టాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగ్‌రావు, ఎన్నికల పర్యవేక్షణ అధికారి శ్రీనివాసరావు, ఎంపీడీఓలు కృష్ణమోహన్, రమణారావు, తహసీల్దార్లు నరేందర్, హరికృష్ణ పాల్గొన్నారు.


