
చట్టాలపై అవగాహన తప్పనిసరి
గద్వాల: చట్టాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని ప్రిన్సిపల్ సీనియర్ సివిల్‌జడ్జి వి.శ్రీనివాస్ అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం గద్వాల మండలం మదనపల్లిలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. అసంఘటిత రంగ కార్మికులు అంటే ప్రభుత్వంలో నమోదుకాని వ్యాపారాల్లో పనిచేసే వ్యక్తులు అని.. నిత్యం చట్టానికి వెలుపల పనిచేస్తారన్నారు. ఈ రంగం చిన్న వ్యాపారాలను మొదలుకుని ఇంటి ఆధారిత పని వరకు విస్తృత శ్రేణి కార్యకలాపాలను కలిగి ఉంటుందన్నారు. కార్మికులకు తక్కువ వేతనాలు ఇవ్వడం, సామాజిక భద్రత లేకపోవడం, క్రమరహిత ఉపాధి వంటి సమస్యలు ఉంటాయన్నారు. ఏదైనా సమస్యలు తలెత్తితే నేరుగా దరఖాస్తు రూపంలో ఫిర్యాదు చేయాలని సూచించారు. కార్మికులందరూ గుర్తింపు కార్డులు పొందాలని.. తద్వారా ప్రభుత్వం కల్పించే సదుపాయాలను సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో లీగల్ ఎయిడ్ కౌన్సిల్ వి.రాజేందర్, బి.శ్రీనివాసులు, లక్ష్మణస్వామి తదితరులు పాల్గొన్నారు.