
లేబర్ కోడ్‌లను రద్దు చేసే వరకు పోరాటం
గద్వాల: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోడ్‌లను రద్దు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వెంకటస్వామి, నర్సింహ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని పాతబ బస్టాండ్‌లో నిసరన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను హరించేందుకు తీసుకువచ్చిన లేబర్ కోడ్‌లకు వ్యతిరేకంగా కార్మిక వర్గాన్ని సంఘటితం చేసి దీర్ఘకాల ఉద్యమానికి సిద్ధమవుతున్నట్లు చెప్పారు. పెట్టుబడిదారులు, కార్పొరేట్ శక్తులకు రూ.లక్షల కోట్ల కార్మికవర్గ సంపదను రాయితీల రూపంలో అందిస్తుందన్నారు. కార్మికులకు మాత్రం కనీస వేతనాలు ఇవ్వకుండా, భద్రత కల్పించకుండా హక్కులను కాలరాసే విధానాలను కొనసాగించడం దారుణమన్నారు. రూ.లక్షల కోట్ల ధనాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి దేశభక్తి గురించి మాట్లాడే అర్హత కూడా లేదన్నారు. దేశంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ నెల 20న జరగాల్సిన సార్వత్రిక సమ్మెను జూలై 9వ తేదీకి వాయిదా వేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో దానయ్య, రామకృష్ణ, కోళ్ల అంజి, భరత్, నిజాముద్దీన్, హనీఫ్ పాల్గొన్నారు.