
సోలార్ పనులు వేగవంతం
వంగూరు: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో సోలార్ విద్యుత్ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని ప్లానింగ్‌బోర్డు ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్‌కుమార్ సుల్తానియా, విద్యుత్‌శాఖ సీఎండీ ముషారఫ్ అలీ ఫారూఖ్ అన్నారు. శనివారం ఉదయం గ్రామంలోని ఇళ్లపై ఏర్పాటు చేసిన సోలార్ ప్లేట్లను వారు పరిశీలించి విద్యుత్ సరఫరా వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో 482 ఇళ్లుండగా.. 412 ఇళ్లపై సోలార్ ప్లేట్లు బిగించామని, మిగతా 70 ఇళ్ల పైకప్పు మట్టి, రేకులు ఉండటంతో మిగిలిపోయినట్లు అధికారులు వారికి వివరించారు. మట్టి మిద్దెలు ఉన్న ఇళ్ల ఆవరణలోని ఖాళీ స్థలాల్లో సోలార్ ప్లేట్లను ఏర్పాటు చేయాలని రెడ్‌కో అధికారులను ఆదేశించారు. అనంతరం మాట్లాడుతూ.. పైలెట్ ప్రాజెక్టు కింద కొండారెడ్డిపల్లిలో సోలార్ విద్యుత్‌ను ఏర్పాటు చేస్తున్నామని, అన్ని పనులు పూర్తయితే ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని చెప్పారు. వారి వెంట రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు కేవీఎన్ రెడ్డి, గ్రామస్తులు వేమారెడ్డి, కృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు.