
దరఖాస్తుల స్వీకరణ
భూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రమణారావు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలుగు, ఇంగ్లిష్, కంప్యూటర్ సైన్స్, ఫిజిక్స్, జువాలజీ, పొలిటికల్ సైన్స్ సబ్జెక్టులలో అర్హులైన అధ్యాపకులను నియమించినట్లు తెలిపారు. ఈ సబ్జెక్టులలో బోధించేందుకు ఆసక్తి గల అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులలో కనీసం 55శాతం మార్కులు కలిగి ఉండాలని తెలిపారు. అభ్యర్థులు పూర్తి బయోడేటా, ధ్రువీకరణ పత్రాలతో ఈనెల 23వ తేదీలోపు డిగ్రీ కళాశాలలో దరఖాస్తు అందజేయాలని తెలిపారు.
చిట్యాలను
నియోజకవర్గం చేయాలి
చిట్యాల: భూపాలపల్లి నియోజకవర్గంలోని చిట్యాల మండలకేంద్రాన్ని పునర్విభజనలో భాగంగా చిట్యాలను కొత్త నియోజకవర్గంగా ఏర్పాటు చేయాలని గొర్ల, మేకల పెంపకదారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సకినాల మల్లయ్య కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాత తాలుకాగా పేరుగాంచిన చిట్యాల మండలంలో సహజ వనరులు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు అరుదైన స్థలం భౌగోళికంగా నియోజకవర్గానికి సరిపడే వసతులు ఉన్నాయని చెప్పారు. చిట్యాలకు సమీప మండలాలైన టేకుమట్ల, మొగుళ్లపల్లి , రేగొండ, కొత్తపల్లిగోరిని కలుపుకుని నూతన నియోజకవర్గంగా ఏర్పాటు చేయాలని మల్లయ్య కోరారు.
టిప్పర్ అసోసియేషన్
అధ్యక్షుడిగా రొడ్డ రవి
భూపాలపల్లి అర్బన్: ది కాకతీయఖని టిప్పర్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ భూపాలపల్లి అధ్యక్షుడిగా రొడ్డ రవీందర్ ఎన్నికయ్యారు. ఆదివారం యూనియన్ కార్యాలయంలో జరిగిన ఎన్నికల్లో కమిటీని నియమించారు. ఉపాధ్యక్షుడిగా జాడి అశోక్, ప్రధాన కార్యదర్శిగా కుప్పాల ప్రభాకర్, సహాయ కార్యదర్శిగా బొమ్మన తిరుపతి, కోశాధికారిగా కుసుమ రమేష్, కమిటీ సభ్యులుగా శ్రీనివాస్, మధుకర్‌రెడ్డి, కుమార్, కుమారస్వామిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
25న మంద కృష్ణమాదిగ రాక
చిట్యాల: దివ్యాంగుల హక్కుల సాధన కోసం ఈనెల 25న జిల్లాకేంద్రంలో జరిగే సమావేశానికి పద్మశ్రీ అవార్డు గ్రహీత మంద కృష్ణ మాదిగ రానున్నట్లు ఎమ్మార్పీస్ జిల్లా ఇన్‌చార్జ్ రుద్రారం రామచంద్ర మాదిగ తెలిపారు. ఆదివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని దివ్యాంగులు, వితంతువులు, వృద్ధులు అధిక సంఖ్యలో హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కో–ఇన్‌చార్జ్ అంబాల చంద్రమౌళి మాదిగ, మండల అధ్యక్షుడు దొడ్డి శంకర్ మాదిగ, వీహెచ్‌పీఎస్ జిల్లా అధ్యక్షుడు మాచర్ల వంశీ కృష్ణ, ఎంఎస్‌పీ, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు నేరేళ్ల ఓదేలు పాల్గొన్నారు.
వాహనాల తనిఖీ
వెంకటాపురం(కె) : మండల పరిధిలోని బోదాపురం గ్రామశివారులో ఆదివారం ఎస్సై కొప్పుల తిరుపతిరావు ఆధ్వర్యంలో ముమ్మరంగా వాహనాల తనిఖీ చేపట్టారు. మండల కేంద్రానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం నుంచి వచ్చి వెళ్లే వాహనాలు, వాజేడు మండలం నుంచి వచ్చే వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించి తనిఖీ చేశారు. అనుమానిత వ్యక్తులు ఎవరైనా తారస పడితే వారి నుంచి పూర్తి స్థాయి సమాచారాన్ని సేకరించి పంపిస్తున్నారు. తనిఖీల్లో పీఎస్సై సాయికృష్ణ, సీఆర్‌పీఎఫ్ సిబ్బంది, సివిల్ పోలీసులు పాల్గొన్నారు.
23 నుంచి కేయూ ఎంబీఏ
రెండో సెమిస్టర్ పరీక్షలు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ ఎంబీఏ రెండో సెమిస్టర్ పరీక్షలు ఈనెల 23 నుంచి నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ ఆసింఇక్బాల్ తెలిపారు. ఈనెల 23, 25, 28, 30, ఆగస్టు ఒకటి, నాలుగో తేదీల్లో పరీక్షలు జరుగుతాయని వారు పేర్కొన్నారు. ఆయా తేదీల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంటవరకు పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు.

దరఖాస్తుల స్వీకరణ

దరఖాస్తుల స్వీకరణ