
వ్యాధుల భయం
ఈ ఫొటోలో కనిపిస్తున్నది పట్టణంలోని కాారల్‌మార్క్స్ కాలనీ. ఇంటి స్థలంలో ఇళ్లు నిర్మించకపోవడంతో ఖాళీగా దర్శనమిస్తుంది. ఈ స్థలంలో పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగాయి. వర్షపు నీరు నిలిచి దోమలు విజృంభిస్తున్నాయి. ఖాళీ స్థలం ఉండటం వలన చుట్టు పక్కల వారు ఇక్కడే చెత్తను పడేస్తున్నారు. దీంతో రాత్రి వేళలో విషపురుగులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వర్షంతో ఖాళీ స్థలాల్లో నిలుస్తున్న నీరు●
● పెరుగుతున్న పిచ్చి మొక్కలు
● దోమలకు అడ్డా..
● ఆందోళనలో పట్టణవాసులు
భూపాలపల్లి అర్బన్: ఇటీవల కురిసిన చిన్నపాటి వర్షాలకే జిల్లాకేంద్రంలో డ్రెయినేజీలు పొంగిపొర్లుతున్నాయి. ఖాళీ స్థలాల్లో మురికినీరు నిలిచి పిచ్చిమొక్కలు దట్టంగా పెరుగుతున్నాయి. ఖాళీ ప్లాట్లను పట్టించుకోకపోవడంతో సమస్య మరింత తీవ్రమవుతోంది. బీసీ కాలనీ, వెంగల్‌రావు వెంచర్, మైసమ్మకాలనీ వంటి శివారు కాలనీలతో పాటు పట్టణంలోని ఎల్‌బీనగర్, హన్‌మాన్‌నగర్, కారల్‌మార్క్స్ కాలనీ, జవహర్‌నగర్, గాంధీనగర్‌లలో ఈ సమస్య అధికంగా కనిపిస్తుంది.
ఖాళీ స్థలాలతో ఇబ్బందులు
జిల్లాకేంద్రంలోని ఖాళీ ప్లాట్లలో పిచ్చిమొక్కలు విపరీతంగా పెరిగి ఉన్నాయి. మురికినీరు నిలిచి విషపూరిత, పాములు, దోమలు, ఈగలకు ఆవాసంగా మారాయి. సాయంత్రం వేళల్లో ఇవి ఇళ్లలోకి చొరబడుతుండడంతో కాలనీవాసులు భయాందోళనకు గురవుతున్నారు. తలుపులు మూసుకోకపోతే ఇబ్బందులు తప్పడం లేదని వారు చెబుతున్నారు. మున్సిపల్ అధికారులు ఈ సమస్యను పట్టించుకోకపోవడంతో స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. డెంగీ, మలేరియా, టైఫాయిడ్ వంటి జబ్బులు సైతం ప్రబలే ప్రమాదం కనిపిస్తుంది. నిబంధనల ప్రకారం మున్సిపల్ అధికారులు ఈ స్థలాలను శుభ్రం చేసి, యజమానుల నుంచి ఖర్చు వసూలు చేయవచ్చు. కానీ ఈ విధానం అమలు కావడం లేదు. బ్లీచింగ్ పౌడర్, కెమికల్ స్ప్రే వంటి చర్యలపై దృష్టి సారించడం లేదని ఆరోపణలు వస్తున్నాయి.
పరిష్కార మార్గాలు
మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి ఖాళీ స్థలాల్లోని పిచ్చిమొక్కలను తొలగించడం, డ్రెయినేజీలను సక్రమంగా ఏర్పాటు చేయడం, ఫాగింగ్ అన్ని కాలనీల్లో నిర్వహించడం, యజమానులకు నోటీసులు జారీ చేసి జరిమానాలు విధించడం వంటి చర్యలు చేపట్టాలి. ఇలా చేస్తే పారిశుద్ధ్య సమస్యలు తగ్గి ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణం లభిస్తుంది.

వ్యాధుల భయం