
రాష్ట్ర చరిత్రలోనే అరుదైన రికార్డు
భూపాలపల్లి రూరల్: రైతులకు ఇచ్చినమాట ప్రకారం 9 రోజుల్లో రూ.9వేల కోట్ల నగదు బదిలీ చేయడం రాష్ట్ర చరిత్రలోనే అరుదైన రికార్డని, ఇప్పటివరకు రాష్ట్రంలో కోటి 49లక్షల 39వేల 111 ఎకరాలకు రైతు భరోసా అందించిన ఘనత సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వానిదని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. రైతుభరోసా నగదు బదిలీ విజయవంతంగా పూర్తయిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ‘రైతు పండుగ’ పేరుతో జరుపుతున్న నేపథ్యంలో మంగళవారం జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్‌లో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఇస్లావత్ దేవన్ అధ్యక్షతన రైతు భరోసా సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్యఅతిథిగా హాజరై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సాగులో ఉన్న ప్రతి ఎకరానికి పెట్టుబడి సాయం అందిస్తున్నట్లు తెలిపారు. కేంద్రం కొనుగోలు చేయలేని పంట ఉత్పత్తులను రాష్ట్ర ప్రభుత్వం మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేయిస్తోందని తెలిపారు. అనంతరం వాకర్స్‌తో కలిసి జయశంకర్ పార్కును పరిశీలించారు. పలు అభివృద్ధి పనులు చేయిస్తానని వాకర్స్‌కు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రైతు భరోసా సంబురాల్లో ఎమ్మెల్యే గండ్ర