
ఆయిల్‌పామ్ సాగును పెంచాలి●
● కలెక్టర్ రిజ్వాన్ బాషా
జనగామ రూరల్: రైతులకు అధిక ఆదాయాన్ని ఇచ్చే ఆయిల్‌పామ్ సాగును పెంచాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లో ఆయిల్ పామ్ విస్తీర్ణం పెంపుపై ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఉద్యానవన, వ్యవసాయ శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 3,500 ఎకరాలు ఆయిల్ పామ్ సాగుకు అవకాశం ఉందని, ముందుగా గుర్తించిన 700 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగుకు చర్యలు తీసుకోవాలన్నారు. 2,800 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేసేందుకు ఉద్యానవన, వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా లక్ష్యాలు రూపొందించుకొని ఫలితాలు సాధించాలన్నారు. భూగర్భ జలాలను పరిరక్షించేందుకు ప్రతీ రైతువేదికలో ఇంకుడుగుంతలు నిర్మించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యానవన, పట్టు పరిశ్రమ శా ఖ అధికారి శ్రీధర్, వ్యవసాయ శాఖ అధికారి రా మారావు నాయక్, సహకార శాఖ అధికారి రాజేందర్ రెడ్డి, ఆయిల్ ఫెడ్ జిల్లా మేనేజర్ శంకర్, తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉన్నత విద్య
ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉన్నతమైన విద్య, పౌష్టికాహారం అందుతుందని కలెక్టర్ రిజ్వాన్ బాషా తెలిపారు. బుధవారం మండలంలోని ఓబుల్‌కేవాపూర్ జెడ్పీ హైస్కూల్‌ను కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా 9, 10 తరగతిలో విద్యార్థుల సామర్థ్యాలు, డిజిటల్ బోధన తీరు, మధ్యాహ్నం భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థుల సామర్థ్యాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఈ విద్యాసంవత్సరం టెన్త్ ఫలితా ల్లో మొదటి స్థానం వచ్చేలా విద్యార్థులు, ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. కష్టమైన సబ్జెక్టులు ఉంటే ఇప్పటినుంచే ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. మధ్యాహ్న భోజనం మెనూలోది కాకుండా వేరేది పెడితే కఠిన చర్యలు తప్పవన్నారు. అనంతరం అంగన్‌వాడీ పాఠశాలను సందర్శించి పిల్లల బరువు, ఎత్తు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఈఓ భోజన్న, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
జీరో పర్మిట్ విధానం అమలు చేయాలి
జిల్లాలో ఆన్‌లైన్‌లో జీరో పర్మిట్ విధానాన్ని పక్కాగా అమలు చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో ఇసుక, కంకర, ఖనిజ వనరులకు సంబంధించిన ఆన్‌లైన్‌ల జీరో పర్మిట్, టీజీఎండీసీలో ఇసుక అనుమతులు తీసుకునే విధానంపై సంబంధిత శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జీరో పర్మిట్ విధానం ద్వారా అనుమతులు తీసుకునే విధంగా కాంట్రాక్టర్లకు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో మైనింగ్ శాఖ ఏడీ విజయ్ కుమార్, ఇంజనీరింగ్ విభాగాల అధికారులు పాల్గొన్నారు.