
నాలాల క్లీనింగ్.. గుంత పూడ్చివేత
జనగామ: జనగామ పట్టణంలో మట్టి, చెత్త, ప్లాస్టిక్ వ్యర్ధాలతో నిండిన నాలాల క్లీనింగ్ పనులు పురపాలక అధికారుల పర్యవేక్షణలో కొనసాగుతున్నాయి. పురపాలక అధికారుల నిర్లక్ష్యం, అలసత్వంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ‘మూణ్నాళ్ల ముచ్చటేనా’, ‘కంపు కంపు’, మట్టిరోడ్లు మస్తు తిప్పలు’, ‘చెత్త కంపు’ శీర్షికన సాక్షిలో ప్రచురితమైన వరుస కథనాలు పట్టణంలో చర్చనీయాంశంగా మారాయి. ఈ కథనాలతో శానిటేషన్, ఇంజనీరింగ్ శాఖల అధికారులు నిద్రమత్తు వీడారు.. నాలాల్లో చెత్తను తొలగిస్తుండగా, రోడ్లపై చెత్తను డంప్ యార్డుకు తరలిస్తున్నారు. ఈ కార్యక్రమం నిరంతర ప్రక్రియగా సాగితేనే పట్టణంలో స్వచ్ఛత నెలకొంటుంది. ఈ దిశగా అధికారులు నిత్యం పర్యవేక్షణ చేస్తే, సమస్యలు పునరావృతం కాకుండా ఉంటుందనే అభిప్రాయాన్ని ప్రజలు వ్యక్తం చేస్తూనే.. కమిషనర్ మాత్రం తన సీటును వదిలిబయటకు రాకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. దోమల నివారణకు గురువారం సాయంత్రం సంబంధిత కార్మికులు జనగామలో ఫాగింగ్ చేశారు.
ప్రమాదకర గుంతకు మోక్షం
హెడ్‌పోస్టాఫీస్ మలుపు వద్ద ప్రమాదకరంగా మారిన గుంతను పూడ్చి వేశారు. సాక్షి లో వచ్చిన కథనాలకు సంబంధించిన ప్రతులతో అమ్మ ఫౌండేషన్ సంస్థ నిరసనలు తెలుపగా, అధికారులు స్పందించారు. ఇంజనీరింగ్ డిపార్డుమెంట్ ఏఈ మహిపాల్ ఆధ్వర్యంలో గుంతలో సీసీ వేయించి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకున్నారు. ప్రజాసమస్యలపై నిత్యం సాక్షి చేస్తున్న పోరాటానికి ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

నాలాల క్లీనింగ్.. గుంత పూడ్చివేత

నాలాల క్లీనింగ్.. గుంత పూడ్చివేత