
పట్టణ సుందరీకరణకు రూ.1.50 కోట్లు
జనగామ: జనగామ పట్టణంలోని బతుకమ్మకుంటతోపాటు చుట్టూ సుందరీకరణ పనుల కోసం రూ.1.50 కోట్లు ఖర్చు చేయనున్నట్లు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ తెలిపారు. సుందరీకరణ పనులపై మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులతో కలెక్టరేట్‌లో శుక్రవారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. బతుకమ్మ చుట్టూ పాదచారులకు పాత్ వే నిర్మాణంతోపాటు సేదదీరేందుకు బెంచీలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఓపెన్ జిమ్, పిల్లలు ఆడుకునే పరికరాలు, కుంట చుట్టూ గ్రిల్స్, గార్డెన్ లైటింగ్, కట్టపై హైమాస్ లైటింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. బతుకమ్మ కుంటలో బురద మట్టి పేరుకుపోయి, దుర్గంధం వెదజల్లడంతో రూ.10 లక్షలతో పూడికతీత పనులు చేపట్టినట్లు తెలిపారు. బస్టాండ్ చౌరస్తాలో డివైడర్‌పై 12 ఆకృతులతో సూర్య నమస్కారాలు, 12 అడుగుల ఎత్తుతో నమస్కార ముద్ర విగ్రహా న్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. హైదరాబాద్ బైపాస్ రోడ్డులో సాయుధ పోరాట యోధురాలు వీరనారి చాకలి ఐలమ్మ, సర్దార్ సర్వాయి పాపన్న, దొడ్డి కొమరయ్య స్మారక చిహ్నాల ఏర్పాటుతోపాటు వాటర్ ఫౌంటేషన్‌కు సంబంధించిన పనులు పురోగతిలో ఉన్నట్లు తెలిపారు. హనుమకొండ బైపాస్‌పై పట్టణానికి ఆకర్షనీయమైన ప్రవేశ ద్వారం పనులు జరుగుతున్నట్లు స్పష్టం చేశారు. పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామన్నారు.
జనగామ చుట్టూ స్వాగత తోరణాలు
జంక్షన్‌లో సూర్యనమస్కారాల విగ్రహాలు
అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్