
స్థానిక పోరుకు సై
పల్లెల్లో రాజకీయ నేతల హడావుడి
జనగామ: స్థానిక ఎన్నికలపై హైకోర్టు తీర్పుతో పల్లెల్లో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. కొద్దిరోజుల్లో స్థానిక సంస్థల ఎలక్షన్ల కోసం నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండడంతో ఆశావహులు రంగలోకి దిగుతున్నారు. కేడర్‌తోపాటు అధిష్టానం ఆశీస్సుల కోసం తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. పోటీకి సర్వం సిద్ధం చేసుకుంటూ, రిజర్వేషన్లు ఎలా ఉంటాయ నే దాని పై కులాల వారీగా లెక్కలు వేసుకునేపనిలో పడ్డారు.
తెరపైకి ఆశావహులు
స్థానిక సంస్థల ఎన్నికలకు కొద్దిరోజుల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండడంతో ఆశావహులు ఖద్దర్ డ్రెస్‌లతో ప్రజల ముందు ప్రత్యక్షమవుతున్నారు. గత ఏడాది ఫిబ్రవరి 2న సర్పంచ్, జూలై 4న ఎంపీటీసీ, జెడ్పీటీసీల పదవీ కాలం ముగిసింది. అప్పటి నుంచి గ్రామం, మండలం, జిల్లా పరిషత్, మున్సిపాలిటీలు స్పెషల్ ఆఫీసర్ల పాలనలో కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగా, పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు చేసినా, బీసీ రిజర్వేషన్లు, కులగణన నేపథ్యంలో వాయిదా పడ్డట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. దీంతో అప్పటి వరకు పోటీపై ఆసిక్తగా ఉన్న వివిధ పార్టీల ఆశావహులు డీలా పడిపోయారు. కేడర్‌తోపాటు సేవా కార్యక్రమాల కోసం లక్షల రూపాయలు ఖర్చు చేసుకున్నారు. స్థానిక సమరానికి సమయం ఆసన్నం కావడంతో కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం, బీఆర్‌ఎస్ పార్టీల్లోని నాయకులతోపాటు స్వతంత్రంగా పోటీ చేసేందుకు ఆశావహులు మళ్లీ తెరపై కనిపిస్తున్నారు. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, వార్డు మెంబర్లుగా పోటీ చేసేందుకు ఉత్సాహంగా ఉన్న నాయకులు విందులతో తమవైపు తిప్పుకునే ప్రయత్నం ప్రారంభించారు. జిల్లాలో ఎక్కడ చూసినా స్థానిక సమరం గురించే చర్చించుకుంటున్నారు.
ప్రధాన, ప్రతిపక్ష పార్టీలకు ప్రతిష్టాత్మకం
రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలదే స్థానిక ఎన్నికల్లో హవా కొనసాగడం ఆనవాయితీ. 2023లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించడంలో జాప్యం చేయడంతో సర్కార్‌పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కొంతమేర ఎలక్షన్స్‌పై పడే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రత్యేక పాలనలో మున్సిపాలిటీలు, గ్రామాల అభివృద్ధి కుటుంబడిపోతుండడం, కేంద్రం నుంచి వచ్చే నిధులు నిలిచిపోవడంతో ఎలక్షన్లు నిర్వహించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది.
అందరికీ ప్రతిష్టాత్మకమే..
అధికార ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌కు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకం కాబోతున్నాయి. స్థానిక సంస్థల్లో తాము బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకుని పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలని బీఆర్‌ఎస్ బరిలో దిగనుండగా, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలను పునరావృతం చేసుకుని సంపూర్ణ విజయం పొందాలని కాంగ్రెస్ సమాయత్తమవుతుంది. ఈ రెండు పార్టీల పరిస్థితి ఇలా ఉంటే.. ఈసారి అత్యధిక స్థానాలను కై వసం చేసుకునేలా బీజేపీ ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందిస్తుంది. సీపీఎం, సీపీఐ, స్వతంత్రులు సైతం బరిలో గట్టి పోటీ ఇచ్చేందుకు తమదైన శైలిలో వ్యూహాలు రచిస్తున్నారు.
రిజర్వేషన్ మారేనా..?
ఎన్నికల్లో పోటీచేయాలంటే మందుగా రిజర్వేషన్ కలిసిరావాలి. అయితే ఆసారి
పాత రిజర్వేషన్లనే కొనసాగిస్తారా.. లేక కొత్త ప్రతిపాదనలు చేస్తారా.. అనే విషయంలో క్టారిటీ లేకపోవడంతో ఆశావహులు సందిగ్ధంలో పడ్డారు. అయితే పాత రిర్వేషన్ల ప్రకారమే ఎలక్షన్లు నిర్వహించబోతున్నట్లు ప్రచారం జరుగుతుండడం గమనార్హం.
తెరపైకి ఆశావహులు
సేవా కార్యక్రమాల్లో బిజీబిజీ
రిజర్వేషన్లపై సందిగ్ధం
సిద్ధమవుతున్న అధికారులు
గత ఏడాది స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయనే మందుస్తు ఊహాగానాలతో అధికారులు అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకున్నారు. ఎలక్షన్ల నిర్వహణ కోసం ఆర్‌ఓ, ఏఆర్‌ఓలు ఇతర సిబ్బంది నియామక ప్రక్రియ పూర్తి చేశారు. స్టేషన్‌ఘన్‌పూర్ డివిజన్‌ను మున్సిపల్ చేయడంతో జిల్లాలో 280 జీపీలు, 2,576 వార్డులు ఉన్నాయి. 12 జెడ్పీటీసీలు, 134 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. జెడ్పీ ఎలక్షన్ల కోసం 753, పంచాయతీ ఎన్నికల కోసం 2,576 పోలింగ్ కేంద్రాలను గుర్తించడంతోపాటు బ్యాలెట్ బాక్స్‌లు, బ్యాలెట్ ముద్రణ, ఎలక్షన్ సామగ్రిని సిద్ధం చేసి అధికారులు రెడీగా ఉన్నారు.