● కలెక్టర్ సత్యప్రసాద్
జగిత్యాల: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అమలులో జిల్లా ముందంజలో ఉందని కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. ఇంటింటికీ సంక్షేమం.. అభివృద్ధి ప్రతి గ్రామంలో కొనసాగిందన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మార్చి 6 నుంచి 385 గ్రామాలు, 100కు పైగా మున్సిపల్ వార్డుల్లో సభలు నిర్వహించామని, పెండింగ్‌లో ఉన్న 10వేల దరఖాస్తులను పరిష్కరించామని, సీజనల్ వ్యాధులు, క్షయ, మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నామని తెలిపారు. పోలీస్ శాఖ సమన్వయంతో అరైవ్ అలైవ్, రహదారి భద్రత చేపట్టామన్నారు. అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీ, 1500 ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు చేశామన్నారు. మత్తు పదార్థాఆల నివారణపై అవగాహన కల్పించామని పేర్కొన్నారు. 45 రోజుల్లో 85,616 మంది రైతుల నుంచి 5,19,156 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ.1,233 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించామన్నారు. కేంద్రీయ విద్యాలయంతోపాటు, యంగ్ ఇండియా స్కూల్, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటుకు ముందడుగు పడిందన్నారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో 18 కొత్త ఆర్టీసీ బస్సులు అందుబాటులోకొచ్చాయన్నారు. ఈ ఏడాది45 లక్షల మొక్కలు నాటి వచ్చే రెండు నెలల్లో లక్ష్యాన్ని చేరుకుంటామని తెలిపారు.
జగిత్యాలవాసికి దక్షిణాఫ్రికాలో అరుదైన గౌరవం
మల్యాల: ఉపాధి కోసం దక్షిణాఫ్రికా వెళ్లి.. అక్కడి తెలుగు ప్రజలకు సేవలందిస్తూ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తున్న జగిత్యాలవాసి గుర్రాల నాగరాజుకు అక్కడ వింటర్ హీరోగా గౌరవం లభించింది. దక్షిణాఫ్రికాలోని హాల్ సంస్థ సామాజిక సేవలో సేవలందిస్తున్న ఎనిమిది మందిని ఎంపిక చేయగా.. జగిత్యాలకు చెందిన నాగరాజు ఎంపికయ్యారు. నాగరాజు 18ఏళ్లుగా దక్షిణాఫ్రికాలో స్థిరపడి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. కరోనాకాలంలో వేలాదిమందికి ఆహారం అందించారు. నాగరాజును జిల్లాకు చెందిన పలువురు ఫోన్‌లో అభినందించారు.
ఎల్లమ్మకు బోనాలు
గొల్లపల్లి: మండలంలోని రాఘవపట్నంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఎల్లమ్మ తల్లికి బోనాలు చేశారు. డప్పు చప్పుళ్ల మధ్య ఆలయానికి వెళ్లి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. సర్పంచ్ భవాని, గౌడ సంఘం అధ్యక్షుడు ప్రవీణ్, ఉపాధ్యక్షుడు తిరుపతి, మాజీ సర్పంచ్ తిరుపతి, మాజీ ఎంపీటీసీ రాజేందర్, డైరెక్టర్లు, నాయకులు పాల్గొన్నారు.


