
ఖాదీ ప్రతిష్టాన్‌పై ‘విజిలెన్స్’
● సంస్థ వ్యవహారాల్లో అక్రమాలు జరిగాయని ఫిర్యాదులు ● వివాదాల నేపథ్యంలో విచారణకు ఆదేశించిన ప్రభుత్వం ● రెండు రోజులుగా వివరాలు సేకరిస్తున్న అధికారులు
మెట్‌పల్లి: ఎంతో ఘన కీర్తి కలిగిన మెట్‌పల్లి ఖాదీ గ్రామోద్యోగ్ ప్రతిష్టాన్‌ను వివాదాలు చుట్టుముడుతున్నాయి. సంస్థలో జరుగుతున్న వ్యవహారాల్లో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వీటిపై నియోజకవర్గానికి చెందిన ఓ కాంగ్రెస్ ముఖ్య నేత కొంతకాలం క్రితం ప్రభుత్వ పెద్దలను కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో వారు విచారణ జరిపి నివేదికను అందించాలని విజిలెన్స్ విభాగాన్ని ఆదేశించారు. ప్రస్తుతం ఆ విభాగం అధికారులు రంగంలోకి దిగి క్షేత్ర స్థాయిలో వివరాలు సేకరిస్తున్నారు.
భూముల అమ్మకం నుంచి మొదలు..
● మెట్‌పల్లి ఖాదీ ప్రతిష్టాన్‌కు పట్టణంలోనే కాకుండా పలు ప్రాంతాల్లో స్థిరాస్తులు ఉన్నాయి.
● ఇందులో నుంచి పూడూరు, కిసాన్‌నగర్‌లో ఉన్న స్థలాలను విక్రయించారు.
● ఆ భూములను తక్కువ ధరకు విక్రయించి.. భారీగా లబ్ధి పొందారని ఆ సమయంలో పాలకవర్గంలోని ముఖ్యులపై ఆరోపణలు వెల్లువవెత్తాయి.
● పూడూరులో స్థానిక ప్రజలు అమ్మిన భూములను వెనక్కి తీసుకోవాలంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేశారు.
అనుమతి లేకుండా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం..
● పట్టణంలో ఖాదీ ప్రతిష్టాన్‌కు సుమారు 14ఎకరాల భూమి ఉంది. సంస్థకు ఆదాయం సమకూర్చుకోవడం కోసం కొంత భూమిలో మూడేళ్ల క్రితం సుమారు 200 గదులతో కూడిన కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించారు.
● దీనికి మున్సిపల్ నుంచి అనుమతులు తీసుకోలేదు. రాజకీయ ఒత్తిళ్లతో ఆ సమయంలో అధికారులు చర్యలు తీసుకోకుండా మిన్నకుండిపోయారు.
● ఆ కాంప్లెక్స్‌లోని గదులను అద్దెకిచ్చి ప్రయోజనం పొందుతున్న ప్రతిష్టాన్.. మున్సిపల్‌కు ఏటా ఆస్తి పన్ను కూడా చెల్లించడం లేదు.
● ప్రతిష్టాన్ పాలకవర్గం తీరుపై మున్సిపల్‌కు రూ.లక్షల్లో నష్టం వాటిల్లుతోందని అధికారులు చెబుతున్నారు.
సమీకృత మార్కెట్‌కు గ ‘లీజు’ ఒప్పందం
● సమీకృత మార్కెట్ నిర్మాణానికి అవసరమైన ప్రభుత్వ స్థలం స్థానికంగా అందుబాటులో లేకపోవడంతో మున్సిపల్ అధికారులు ఖాదీకి చెందిన 20 గుంటల స్థలాన్ని లీజుకు తీసుకున్నారు.
● ఇందుకు ప్రతినెలా రూ.1.50లక్షల అద్దె చెల్లింపు.. తర్వాత రెండేళ్లకోసారి పది శాతం పెంపునకు అంగీకరిస్తూ 2021 మార్చి 21న మున్సిపాలకవర్గం తీర్మానం చేసింది.
● ఆ అద్దె చెల్లింపు 2022 ఏప్రిల్ నుంచి అమల్లోకి వచ్చేలా ఒప్పందం జరిగింది.
● 2021 జూన్‌లో అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మార్కెట్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. నిధుల కొరతతో అవి ఇప్పటికీ పూర్తి కాలేదు.
● అయినా అద్దె చెల్లించాలంటూ ఖాదీ సంస్థ మున్సిపాలిటీకి నోటీసులు ఇస్తూ వస్తోంది. ఇప్పటివరకు అద్దె బకాయిలు రూ.అర కోటికి పైగానే ఉన్నట్లు తెలిసింది.
● మున్సిపల్ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మార్కెట్ నిర్మాణం పూర్తయి అందులో వ్యాపారాలు మొదలైన తర్వాత వచ్చే ఆదాయంతో అద్దె చెల్లింపు జరిగేలా ఒప్పందం చేసుకోవాల్సి ఉండగా.. అందుకు భిన్నంగా పాలకవర్గం, అధికారులు నిర్ణయం తీసుకోవడం విమర్శలకు దారి తీసింది.
● ఆ ఒప్పందంతో ఖాదీకి లాభం కాగా.. మున్సిపాలిటీకి భారీగా నష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
రంగంలోకి విజిలెన్స్ అధికారులు
● ఖాదీ ప్రతిష్టాన్ వ్యవహారాల్లో అక్రమాలు జరుగుతున్నాయని ఓ కాంగ్రెస్ నేత చే సిన ఫిర్యాదుతో ప్రభుత్వం స్పందించి విచారణకు ఆదేశించింది.
● రెండు రోజులుగా విజిలెన్స్ అధికారులు పట్టణానికి వచ్చి ఖాదీ, మున్సిపల్ నుంచి వివిధ కోణాల్లో వివరాలు సేకరిస్తున్నారు.
● ప్రధానంగా అనుమతి లేకుండా కాంప్లెక్స్ నిర్మించినప్పటికీ చర్యలు చేపట్టకపోవడం, సమీకృత మార్కెట్ లీజు విషయంలో నిబంధనల ప్రకారం వ్యవహరించకపోవడం వంటి వాటిపై విజిలెన్స్ అధికారులు దృష్టి సారించినట్లు తెలిసింది.
● మొత్తానికి ఖాదీ ప్రతిష్టాన్‌కు సంబంధించిన వ్యవహారాలపై సాగుతున్న విజిలెన్స్ విచారణతో రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందోనన్నది ఆసక్తిగా మారింది.

ఖాదీ ప్రతిష్టాన్‌పై ‘విజిలెన్స్’