
వర్షాకాలం.. ముంపు భయం
● బల్దియాలో మునుగుతున్న కాలనీలు ● ముందు జాగ్రత్తలు చేపట్టని అధికారులు
రాయికల్: వర్షాకాలం వచ్చిందంటేనే రాయికల్ బల్దియా ప్రజల్లో వణుకు పుడుతుంది. పెద్ద వర్షం కురిసిందంటే చాలు శివారు కాలనీలను వరదనీరు ముంచెత్తుతుంది. ఏటా ఇదే తతంగం కొనసాగుతున్నా.. బల్దియా అధికారులు మాత్రం ముందస్తు చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. బల్దియా పరిధిలోని పెద్ద చెరువు సుమారు 200 ఎకరాల విస్తీర్ణం ఉంటుంది. రాయికల్, మైతాపూర్, చెర్లకొండాపూర్ గ్రామాలకు సాగునీటికి ఈ చెరువే ఆధారం. ఆయా ప్రాంతాల్లో భూగర్భజలాల పెంపునకూ ఇది ఎంతో దోహదపడుతుంది. అయితే వర్షకాలంలో మాత్రం చెరువు నిండి వరద నీరు ఉప్పొంగి ప్రవహిస్తే బల్దియాలోని 5, 6, 7 వార్డుల్లోని ఇళ్లలోకి నీరు చేరుతుంది. ము ఖ్యంగా భీమన్నవాడ, మత్తడివాడ, గొల్లవాడ, కేశవనగర్ కాలనీలు వానకాలం వచ్చిందంటే ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. పెద్ద చెరువు నిండినప్పుడు చెర్లకొండాపూర్, రాయికల్, మైతాపూర్ చెరువు కట్ట తీర ప్రాంతాల్లో పంట పొలాలు నీటమునగడంతో రైతులు తీవ్ర నష్టాలకు గురవుతారు.
కానరాని చర్యలు
రాయికల్ మత్తడి నుంచి వరదనీరు ఉధృతంగా ప్రవహించడంతో కేశవనగర్, గొల్లవాడలోని ఇళ్లలోకి నీరు చేరుతుంది. ఈ కాలనీలకు వరద నీరు రాకుండా మత్తడికి ఇరువైపులా రక్షణ గోడలు నిర్మించాల్సి ఉండగా.. అధికారులెవరూ పట్టించుకోకపోవడంతో ఏటా ఈ సమస్య ఎదురవుతోందని కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి తమ కాలనీల్లోకి నీరు చేరకుండా శాశ్వత చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.