
‘ఇందిరమ్మ’కు దూరమవుతున్న నిరుపేదలు
● ఇళ్ల నిర్మాణాలకు అంగీకరించని అటవీశాఖ ● నాయకపుగూడెం ప్రజల విచిత్ర పరిస్థితి ● ఏళ్లు గడుస్తున్నా పూరి గుడిసెల్లోనే నివాసం ● సొంతింటి కోసం ఎదురుచూస్తున్న 62 కుటుంబాలు ● ప్రజాప్రతినిధులు చొరవ చూపాలంటున్న స్థానికులు
సారంగాపూర్: బీర్‌పూర్ మండలం కండ్లపల్లి పరిధిలోని నాయికపుగూడెం ప్రజల పరిస్థితి విచిత్రంగా మారింది. ఇక్కడి ప్రజలు ఏళ్లతరబడి పూరి గుడిసెల్లోనే నివాసముంటున్నారు. వారి కోసం ప్రభుత్వం విద్యుత్ లైన్లు ఏర్పాటు చేసింది. రూ.20 లక్షలతో పాఠశాల నిర్మించింది. అంగన్‌వాడీ కేంద్రం కూడా కొనసాగుతుంది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి గ్రామానికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసింది. అత్యంత పేదలైన నాయికపుగూడెం గ్రామానికి కూడా ఇళ్లు మంజూరవుతాయని ఎదరుచూశారు. కానీ.. అటవీశాఖ ఇళ్ల నిర్మాణానికి అనుమతి ఇవ్వకపోవడంతో సుమారు 62 కుటుంబాలు ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నారు. తామేం పాపం చేశామని తమను ఎవరూ పట్టించుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు.
కండ్లపల్లి నాయికపుగూడెం
బీర్‌పూర్ మండల కేంద్రానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో కండ్లపల్లి నాయికపుగూడెం ఉంటుంది. ఇ క్కడ 300పైనే జనాభా ఉంటుంది. ప్రాథమిక పాఠశాలకు ఇక్కడ పక్కా భవనం ఉంది. అందులోనే అంగన్‌వాడీ కేంద్రం కూడా కొనసాగిస్తోంది. రేషన్‌బియ్యం కోసం కండ్లపల్లికి కాలినడకన వెళ్లాల్సిందే. ఇక్కడ సుమారు 62 గిరిజన కుటుంబాలు నివసిస్తున్నాయి. అత్యంతపేదలైన వీరు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నారు. పథకం కింద రూ.6లక్షలు వస్తే ఇళ్లు నిర్మించుకుంటామని, తమ ఇబ్బందులు తప్పుతాయని గిరిజనులు ఆశగా ఎదురుచూశారు. దీనికి అనుగుణంగా అధికారులు ఇంటింటా సర్వే నిర్వహించి అందరూ ఇందిరమ్మ ఇళ్లకు అర్హులని నిర్ధారించారు.
అటవీశాఖ అభ్యంతరం
62 గిరిజన కుటుంబాలు ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణం చేసుకుంటామని చెప్పడంతో అధికారులు 62 మంజూరుకు నిర్ణయించారు. అయితే వీరు నివాసం ఉంటున్న భూమి అటవీశాఖ పరిధిలోని రిజర్వ్‌ఫారెస్ట్ కింద వస్తుందని, ఇక్కడ ఇళ్లు నిర్మాణం చేయడానికి వీలు లేదని అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇళ్ల మంజూరుకు లబ్ధిదారుడి ఫొటో క్యాప్చరింగ్ చేయాల్సి ఉండగా, అటవీశాఖ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఎల్–1 ఫాంలోకి చేర్చలేదు. ఇది గిరిజనుల ఇళ్ల నిర్మాణ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది.
ప్రజాప్రతినిధులను కలిసిన గిరిజనులు
తమకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని, అటవీశాఖతో మాట్లాడాలని పేర్కొంటూ గిరిజనులు ఎమ్మెల్యే సంజయ్‌కుమార్, మాజీ మంత్రి జీవన్‌రెడ్డిని కలిసి తమ సమస్యను వివరించారు. మాజీ సర్పంచ్ మహంకాళి రాజన్న పంచాయతీ రాజ్, గిరిజన శాఖ మంత్రి సీతక్క దృష్టికి తీసుకెళ్లారు. అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను మంత్రి సీతక్క ఆదేశించారు. ఈ విషయంలో తమకు న్యాయం చేయాలని సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ చొరవ చూపాలని గిరిజనులు కోరుతున్నారు.
తాటిపత్రిలు కప్పుతున్నాం
వర్షాకాలం వస్తే ఇంటిమీద తాటిపత్రిలు కప్పుతున్నాం. గుడిసెల్లో ఉండడంతో విష పురుగులు, పాముల భయంతో వణికిపోతున్నాం. ప్రభుత్వం మాపై దయచూపాలి. ఇందిరమ్మ ఇళ్లకు అటవీశాఖ నుంచి అనుమతి ఇప్పించాలి.
– గోపి రాజవ్వ, నాయికపుగూడెం

‘ఇందిరమ్మ’కు దూరమవుతున్న నిరుపేదలు

‘ఇందిరమ్మ’కు దూరమవుతున్న నిరుపేదలు