
మామిడిపై అనాసక్తి
● 40 ఏళ్లవి కావడంతో నరికేస్తున్న రైతులు
● మూడేళ్లుగా ధరలు అంతంతే
● ఆదాయం రాకపోవడంతో తొలగింపు
జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలోని చాలా ప్రాంతాల్లోని మామిడి తోటలు 30 నుంచి 40 ఏళ్లవి కావడంతో సరైన దిగుబడి ఇవ్వడం లేదు. మరోవైపు మూడేళ్లుగా వాతావరణంలో మార్పులతో తెగుళ్లు, పురుగుల విజృంభనతో మామిడి అనుకున్న స్థాయిలో రావడం లేదు. సరైన ఆదాయం రాక రైతులు తోటలను తొలగించి ఆయిల్ పాం, వరి వంటి ఇతర పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. మరికొందరు చెట్లను కొంతభాగం కట్ చేసి కాపు కోసం వేచి చూస్తున్నారు.
45 వేల ఎకరాల్లో మామిడి సాగు
జిల్లాలో దాదాపు 45 వేల ఎకరాల్లో మామిడి తోటలు సాగులో ఉన్నాయి. ఎక్కువగా బంగినపల్లి, దశేరి, హిమాయత్ రకాలున్నాయి. ఏటా 1.50 లక్షల టన్నుల దిగుబడి వస్తుంది. ఏడాది పొడవునా మామిడి యాజమాన్యంలో భాగంగా కొమ్మల కత్తి రింపు, దుక్కి దున్నడం, ఎరువులు వేయడం, పురుగుమందులు పిచికారీ చేయడం వంటి పనులకు ఎకరాకు రూ.60వేల నుంచి రూ.70 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. మామిడి సీజన్ ప్రారంభంలో కిలో రూ.60 నుంచి రూ.70 ఉంటున్న ధరలు మా మిడి కాయలు మార్కెట్‌కు వచ్చే వరకు కిలో రూ. 20 నుంచి రూ.30కి పడిపోతున్నాయి. ఫలితంగా మామిడి సాగుకు రైతులు పెడుతున్న పెట్టుబడికి.. వస్తున్న ఆదాయానికి పొంతన ఉండటం లేదు.
ఏపుగా పెరిగి...దిగుబడి తగ్గుతుండటంతో..
మామిడి యాజమాన్యంపై రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన లేక చెట్లచుట్టూ పక్కనున్న కొమ్మలను కత్తిరించి.. పైకి ఉన్న కొమ్మలను అలాగే వదిలేశారు. పైకి ఉన్న కొమ్మలు విపరీతంగా పెరిగాయి. ఆ కొమ్మలకు మందులు పిచికారీ చేయాలన్న.. కాయలు తెంపాలన్న కష్టంగా మారింది. ఇలాంటి తోటల్లో సూర్యరశ్మి తగలక తెగుళ్లు, పురుగులు ఆశించి తీవ్ర నష్టం చేస్తున్నాయి. మరోవైపు జిల్లాలో భూగర్భజలాలు 2.42 మీటర్ల లోతులోనే ఉండటంతో చాలా ప్రాంతాల్లో మామిడి తోటల నుంచి నీరు బయటకు వెళ్లడం లేదు. తేమ ఎక్కువగా ఉండి పూత రావడం లేదు. వరి క్వింటాల్‌కు రూ.2,380 ఉండటం.. కేజీవీల్స్‌తో దున్నించడం, హార్వెస్టర్లతో కోయించడం, ఎకరాకు 30 క్వింటాళ్లకు పైగా దిగుబడి రావడం, ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లోనే కొనడంతో రైతులు ఎక్కువగా మామిడి తోటలను నరికేసి వరి పంట వైపు దృష్టి పెడుతున్నారు.
ప్రభుత్వ స్పందన అంతంత మాత్రమే
పండ్లతోటలు పెంచే రైతులకు ఉద్యానశాఖ ద్వారా ప్రభుత్వం గతంలో అనేక రాయితీలు వర్తింపజేసేవి. మామిడి కొమ్మలు కత్తిరించేందుకు కట్టర్లు, రంపాలు సమకూర్చేవి. ఇప్పుడు పరికరాలు ఏమీ ఇవ్వడం లేదు. సాధారణంగా జగిత్యాల మామిడికి మంచి రుచి, నాణ్యత ఉంటుంది. అపెడా ఆధ్వర్యంలో విదేశాలకు ఎగుమతి చేస్తామని, మహిళా సంఘాలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాల ద్వారా మామిడిని సేకరించి, సూపర్ మార్కెట్ల ద్వారా అ మ్ముతామని ప్రభుత్వం ఏటా చెపుతున్నా.. ఆచరణలోకి రావడం లేదు. దళారులు మామిడి మార్కె ట్లో ఇష్టారాజ్యంగా దోపిడీ చేస్తున్నప్పటికీ ఎవరూ పట్టించుకోకపోవడంతో రైతులకు ఆదాయం రాక తోటలను తొలిగించే పరిస్థితి ఏర్పడుతోంది.
ఏటా కొమ్మలు కత్తిరిస్తాం
జిల్లాలో చాలామంది మామిడి తోటలు నరికేస్తున్నారు. నేను చెట్ల కొమ్మలను ఏటా కట్ చేయిస్తాను. దిగుబడి వచ్చినా రేటు రాకపోవడం మామిడి రైతులకు పెద్ద సమస్యగా ఉంది. ప్రభుత్వం మామిడి కొనుగోళ్లపై ప్రణాళిక తీసుకవచ్చి రైతులకు న్యాయం చేయాలి.
– దన్నపునేని వెంకటరమణ, సింగరావుపేట
తోటలను నరికేయొద్దు
మామిడి తోటలను పూర్తిగా నరికేయొద్దు. కొమ్మలను ప్రూనింగ్ చేస్తే చెట్టు ఎక్కువ దిగుబడి ఇస్తుంది. చాలామంది రైతులు మామిడి తోటలను పెంచుతున్నారు. యాజమాన్య పద్ధతులు పాటించడం లేదు. పూత సమయంలో మందులు పిచికారీ చేస్తున్నారు.
– శ్యాం ప్రసాద్, జిల్లా ఉద్యానశాఖాధికారి

మామిడిపై అనాసక్తి

మామిడిపై అనాసక్తి

మామిడిపై అనాసక్తి