ఆ అణు ప్లాంట్‌ పేలి ఉంటే పెను వినాశనమే! 

What Happens If a Nuclear Power Plant Catches Fire - Sakshi

చెర్నోబిల్‌ కంటే  10 రెట్లు ఎక్కువ విధ్వంసం 

ఉక్రెయిన్‌లో జపోరిజియా అణు విద్యుత్కేంద్రంపై రష్యా క్షిపణి దాడులతో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రేడియో ధార్మికత విడుదల కాకుండా ప్లాంట్‌లో పకడ్బందీ భద్రత ఉండడంతో పెను ప్రమాదమే తప్పింది. అలాగాక అణు రియాక్టర్లు పేలి ఉంటే యూరప్‌ సర్వనాశనమై పోయేదని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ గగ్గోలు పెడుతున్నారు. గతంలో జరిగిన చెర్నోబిల్, ఫుకుషిమా వంటి ఘోర అణు ప్రమాదాలను తలచుకొని యూరప్‌ దేశాలన్నీ వణికిపోతున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంతో యూరప్‌ మాత్రమే గాక యావత్‌ ప్రపంచమే ప్రమాదంలో పడిపోతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 

చెర్నోబిల్‌లో ఏం జరిగింది ?  
అది 1986 ఏప్రిల్‌ 26. తెల్లవారుజామున 1:23 గంటలు.  అందరూ గాఢ నిద్రలో ఉన్న వేళ. ఉక్రెయిన్‌లోని చెర్నోబిల్‌ అణు విద్యుత్కేంద్రంలోని నాలుగు అణు రియాక్టర్లలో ఒకటి ప్రమాదవశాత్తూ పేలిపోయింది. అణు విద్యుత్కేంద్రం భద్రతపై పరీక్షలు జరిపిన ఇంజనీర్లు కరెంటు సరఫరా ఆగిపోతే ఏమౌతుందన్న అంచనాలతో చేపట్టిన ప్రయోగం విఫలమై అతి పెద్ద అణు వినాశనానికి దారితీసింది. ఈ ప్రమాదం వల్ల చెలరేగిన మంటలు తొమ్మిది రోజుల పాటు ఎగసిపడుతూనే ఉన్నాయి. వాటిని అదుపు చేయడానికి మిలటరీ హెలికాప్టర్ల ద్వారా 2,400 టన్నుల సీసం, 1800 టన్నుల ఇసుకను విరజిమ్మారు.

అణు రియాక్టర్‌ పేలుడు జరిగినప్పుడు ప్లాంట్‌లో 130 మంది ఉన్నారు. అక్కడికక్కడే ఇద్దరే మరణించినా రేడియేషన్‌ దుష్ప్రభావాలతో తర్వాత 50 మంది ప్లాంట్‌ కార్మికులు, అగ్నిమాపక దళ సభ్యులు మరణించారు. మిగతా వారంతా అక్యూట్‌ రేడియేషన్‌ సిండ్రోమ్‌ (ఏఆర్‌ఎస్‌)తో బాధపడుతూ జీవచ్ఛవాలుగా మిగిలారు. ప్రమాదం జరిగిన వెంటనే 30 వేల మందిని తరలించారు. తర్వాత మరో 3.5 లక్షల మంది తరలివెళ్లారు. వీరిలో 6 వేల మంది రేడియేషన్‌ కారణంగా థైరాయిడ్, కేన్సర్‌ బారిన పడినట్టు తేలింది. రేడియేషన్‌ వల్ల చర్మం, గొంతు కేన్సర్‌తో 2 లక్షల మంది వరకు మరణించినట్టు అంచనా. రేడియేషన్‌ దుష్ప్రభావాలతో ఎంతమంది మరణించారో ఇప్పటికీ పక్కాగా లెక్కల్లేవు. ఈ రేడియేషన్‌ రష్యా నుంచి ఐర్లాండ్‌ దాకా 13 దేశాలకు వ్యాపించింది. చెర్నోబిల్‌ చుట్టుపక్కల 2,600 చదరపు కిలోమీటర్లను నిషిద్ధ ప్రాంతంగా ప్రకటించారు. ప్రపంచంలో అత్యధిక అణుధార్మికత ఉన్న జోన్‌ ఇదే. రేడియో ధార్మికతని తట్టుకునే ఎలుగుబంట్లు, తోడేళ్లు వంటి జంతుజాలం మాత్రమే అక్కడ జీవిస్తోంది. అక్కడ మళ్లీ మనుషులు జీవించే పరిస్థితులు నెలకొనాలంటే 3,000 ఏళ్లు పడుతుందని అంచనా. చెర్నోబిల్‌ను డార్క్‌ టూరిజం ప్లేస్‌గా మార్చి సందర్శకులకు అనుమతిస్తున్నారు. 

యూరప్‌ గజగజ 
రష్యా దాడి చేసిన జపోరిజియా అణు విద్యుత్కేంద్రంలోని ఆరు అణు రియాక్టర్లలో ప్రస్తుతం ఒక్కటే వాడకంలో ఉంది. మిగతా ఐదింటిని మూసేసినా వాటిలో తీవ్రమైన రేడియేషన్‌ వెలువడే అణు ఇంధనం నిల్వలున్నాయి. రష్యా దాడుల్లో రియాక్టర్లు పేలి ఉంటే యూరప్‌ దేశాలన్నీ సెకండ్లలో నాశనమై ఉండేవి. చెర్నోబిల్‌లో ప్రమాదం కంటే పది రెట్లు ఎక్కువ విధ్వంసం జరిగేదని అణు శాస్త్రవేత్తలు చెబుతున్నారు! ఈ కేంద్రంలోని అణు రియాక్టర్లకు భద్రత చాలా ఎక్కువగా ఉంది.

యుద్ధ ట్యాంకులు, శతఘ్నులు దాడి చేసినా తట్టుకునే కాంక్రీట్‌ డోమ్స్‌ రక్షణ కవచంలా ఉన్నాయి. అయినా అణు ప్లాంట్లలో మంటలు చెలరేగడం చాలా ప్రమాదకరం. అణు విద్యుత్కేంద్రాల్లో మరో ప్రమాదం ఏమిటంటే అణు ఇంధన రాడ్స్‌ను చల్లార్చడానికి వాడే చిన్న చిన్న నీటి కొలనులు. వీటిలో అణు ఇంధనం నిండి ఉంటుంది. వాటిపై బాంబులు పడితే రేడియేషన్‌ విడుదలై ప్రమాదం ముంచుకొస్తుంది. రియాక్టర్లు మూతపడి ఉన్నా వాటిని చల్లగా ఉంచే కూలింగ్‌ వ్యవస్థ నిరంతరం పని చేస్తూ ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యమని సిడ్నీ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ డేవిడ్‌ ఫ్లెచర్‌ అన్నారు. లేదంటే పెను ప్రమాదమేనని ఆందోళన వ్యక్తం చేశారు. అణు విద్యుత్‌పై ఆధారపడి ఉన్న ఉక్రెయిన్‌లో మరో నాలుగు స్టేషన్లలో 15 రియాక్టర్లున్నాయి. 

జపోరిజియా అణు విద్యుత్కేంద్రం ప్రత్యేకతలు 

యూరప్‌లోనే అతి పెద్ద అణు విద్యు త్కేంద్రం. ప్రపంచంలో తొమ్మిదోది. 
ప్లాంట్‌లో 6 వీవీఈఆర్‌–1000 పీడబ్ల్యూఆర్‌ అణు రియాక్టర్లున్నాయి. ఒక్కోదాని విద్యుదుత్పత్తి సామర్థ్యం 950 మెగావాట్లు. 
డాన్‌బాస్, కీవ్‌ మధ్య ఎనర్‌హోడార్‌ నగరంలోని కఖ్వోకా రిజర్వాయర్‌ సమీపంలో ఉన్న ఈ ప్లాంటు 40 లక్షల గృహ అవసరాలను తీరుస్తోంది. 
ఉక్రెయిన్‌కు అవసరమైన విద్యుత్‌ సరఫరా లో సగం అణు ప్లాంట్ల నుంచే వస్తోంది. జపోరిజియా ప్లాంట్‌ నుంచి దేశ అవసరాల్లో ఐదో వంతు ఉత్పత్తవుతోంది. 
1984–1995 మధ్య దీని నిర్మాణం జరిగింది. దీని డిజైన్‌ చెర్నోబిల్‌ ప్లాంట్‌ కంటే ప్రత్యేకంగా ఉంటుంది. అగ్నిప్రమాదం తలెత్తినా అణుముప్పు సంభవించకుండా భద్రత ఏర్పాట్లున్నాయి.
 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top