
టారిఫ్‌ల ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా విదేశాంగ మంత్రి వ్యాఖ్య
భారత్‌కు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మార్కో రుబియో
వాషింగ్టన్: అమెరికా–భారత్‌లు ఉమ్మడి దృక్పథంతో ఐక్యంగా ఉన్నాయని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో తెలిపారు. ప్రస్తుత ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించుకుంటూ మెరుగైన భవిష్యత్తు కోసం రెండు దేశాలు కలిసి పనిచేస్తున్నాయన్నారు.
ట్రంప్ ప్రభుత్వం భారత్‌పై భారీగా టారిఫ్‌లను విధించడంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ మంత్రి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటున్న భారత ప్రజలకు అమెరికా తరఫున, వ్యక్తిగతంగా మార్కో రుబియో శుక్రవారం శుభాకాంక్షలు తెలుపుతూ ఒక ప్రకటన విడుదల చేశారు. శాంతియుత, సౌభాగ్యవంత, భద్రత కలిగిన ఇండో–పసిఫిక్ లక్ష్యానికి ఇరు దేశాలు కట్టుబడి ఉన్నాయని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.