కులవివక్షను నిషేధించిన సియాటిల్‌

Seattle Becomes First US City To Pass Anti-Caste Resolution - Sakshi

తొలి అమెరికా నగరంగా ఘనత

ఈ నిర్ణయంపై మిశ్రమ స్పందన

వాషింగ్టన్‌: కులవివక్షను నిషేధిస్తూ అమెరికాలోని సియాటిల్‌ నగరం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అగ్ర రాజ్యంలో ఈ చర్య తీసుకున్న తొలి నగరంగా నిలిచింది. ఈ మేరకు భారత సంతతికి చెందిన నేత, ఆర్థికవేత్త క్షమా సావంత్‌ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని స్థానిక కౌన్సిల్‌ భారీ మెజారిటీతో ఆమోదించింది. నగర వివక్ష వ్యతిరేక విధానంలో కులాన్ని కూడా జోడిస్తూ నిర్ణయం తీసుకుంది. అనంతరం సావంత్‌ మీడియాతో మాట్లాడారు.  కులవివక్ష వ్యతిరేక తీర్మానం భారీ మద్దతుతో ఆమోదం పొందిందని హర్షాతిరేకాల నడుమ వెల్లడించారు.

‘‘అమెరికాలో కులవివక్షపై పోరాటంలో ఇదో కీలక ముందడుగు. ఇక దీన్ని దేశవ్యాప్తంగా విస్తరించేలా ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరముంది’’ అని ఆమె అభిప్రాయపడ్డారు. ఇది చరిత్మాత్మక నిర్ణయమని సియాటిల్‌ టైమ్స్‌ వార్తా పత్రిక కొనియాడింది. ‘‘ఈ రోజు కోసం హత్య, అత్యాచార బెదిరింపులెన్నింటినో తట్టుకుంటూ ముందుకు సాగాం. అంతిమంగా ద్వేషంపై ప్రేమ గెలిచింది’’ అని తాజా నిర్ణయం వెనక కీలకంగా వ్యవహరించిన ఈక్వాలిటీ ల్యాబ్స్‌ అనే స్వచ్ఛంద సంస్థ పేర్కొంది. భారత్‌లో కులవివక్షను 1948లో నిషేధించారు. 1950లో రాజ్యాంగంలో పొందుపరిచారు.

పలు సంస్థల వ్యతిరేకత!
సియాటిల్‌ కౌన్సిల్‌ నిర్ణయాన్ని హిందూ అమెరికన్‌ ఫౌండేషన్‌ (హెచ్‌ఏఎఫ్‌) వంటి సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి! ‘‘ఈ విషయంలో కేవలం దక్షిణాసియావాసులను మాత్రమే లక్ష్యం చేసుకున్నారు. ఇలా వివక్ష వ్యతిరేక విధానంలో కులాన్ని జోడించడం అసంబద్ధం’’ అని హెచ్‌ఏఎఫ్‌ సహ వ్యవవస్థాపకుడు సుహాగ్‌ శుక్లా ఆరోపించారు. ‘‘ఈ ముసుగులో దక్షిణాసియా, ఆగ్నేయాసియా, ఆఫ్రికావాసులతో మిగతా వారి కంటే భిన్నంగా వ్యవహరించనున్నారు. ఈ కుటిల యత్నాలకు ఈ ఓటింగ్‌ ద్వారా ఆమోదముద్ర పడింది’’ అంటూ దుయ్యబట్టారు. ఇదో ప్రమాదకరమైన తప్పుడు చర్య అని సంస్థ ఎండీ సమీర్‌ కల్రా అభిప్రాయపడ్డారు.

ఈ చర్య సియాటిల్‌లోని దళిత బహుజనులకు కచ్చితంగా హాని చేసేదేనని అంబేడ్కర్‌–పూలే నెట్‌వర్క్‌ ఆఫ్‌ అమెరికన్‌ దళిత్స్‌ అండ్‌ బహుజన్స్‌కు చెందిన టి.మధు ఆరోపించారు. ఇలా కులాన్ని విధాన నిర్ణయంలో భాగం చేయడం స్థానికుల్లో హిందువుల పట్ల ఉన్న భయాన్ని (హిందూఫోబియా)ను మరింత పెంచుతుందని అమెరికాలోని భారత సంతతివారు ఆందోళన చెందుతున్నారు. హిందువులను భయభ్రాంతులను చేసే యత్నాల్లో భాగంగా అమెరికాలో గత మూడేళ్లలో పది హిందూ ఆలయాలు, గాంధీ, శివాజీ వంటి ఐదు విగ్రహాల విధ్వంస చర్యలు చోటుచేసుకున్నాయి. 2018 అమెరికన్‌ కమ్యూనిటీ సర్వే ప్రకారం అక్కడ ఉంటున్న భారత సంతతి వ్యక్తుల సంఖ్య 42 లక్షల పై చిలుకే. అమెరికా ఎప్పుడూ కులవ్యవస్థను అధికారికంగా గుర్తించకపోయినా అక్కడి దక్షిణాసియావాసులు ఉన్నత విద్యా సంస్థల్లో, పనిచేసే చోట కులవివక్షను ఎదుర్కొన్న ఉదంతాలెన్నో ఉన్నాయి.  

మరిన్ని వార్తలు :

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top