ఎలుకల నుంచే ఒమిక్రాన్‌!

Scientists Claimed New Theory That Omicron Has Reached Humans Through Rats - Sakshi

ఒమిక్రాన్‌లోని 32 మ్యుటేషన్లలో, 7 ఎలుకలకు సోకగలవు

ఒమిక్రాన్‌లో ఎలుకలకు సోకే జన్యువు

జోనోసిస్, రివర్స్ జోనోసిస్ కారణమా?

ఇమ్యునిటీ బలహీణతవల్ల మనుషుల్లోనే రూపాంతరం చెందిందా? ఏది నిజం..

Omicron Variant Updates In Telugu: ఒమిక్రాన్‌.. ప్రస్తుతం ప్రపంచాన్ని మళ్లీ వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్‌. ఇప్పటికే ఉన్నవి చాలనట్టు ఈ కొత్త వేరియంట్‌ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చిందనే ఆందోళన అంతటా వ్యక్తమవుతోంది. దీనిపై శాస్త్రవేత్తలు ఇప్పటికే పరిశోధనలు మొదలుపెట్టారు. కరోనా రూపుమార్చుకుని (మ్యూటేషన్‌ చెంది) కొత్త వేరియంట్‌గా ఎలా మారిందన్నది పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎలుకల్లో కరోనా మ్యూటేట్‌ అయి ‘ఒమిక్రాన్‌’ పుట్టిందని అంచనా వేస్తున్నారు. ఆ వివరాలేమిటో తెలుసుకుందామా..     
– సాక్షి సెంట్రల్‌ డెస్క్‌

రోగ నిరోధక శక్తిని బట్టి..
సాధారణంగా వైరస్‌లు తమకు ఎదురయ్యే పరిస్థితులను తట్టుకునేందుకు మ్యూటేట్‌ అవుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే రోగ నిరోధక శక్తి సరిగా లేనివారిలో, హెచ్‌ఐవీ బాధితుల్లో లేదా కరోనా ప్రభావానికి గురయ్యే జంతువుల్లో మ్యూటేషన్లకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొత్త వేరియంట్‌ పుడుతుంటాయి. ప్రస్తుతం వణికిస్తున్న ఒమిక్రాన్‌ వేరియంట్‌ కూడా.. రోగ నిరోధక శక్తి దెబ్బతిన్న హెచ్‌ఐవీ రోగిలో మ్యూటేట్‌ అయి ఉంటుందని ఇప్పటికే కొందరు శాస్త్రవేత్తలు అంచనా వేశారు. అయితే ఈ వేరియంట్‌ ఎలుకల్లో పుట్టి.. ‘రివర్స్‌ జూనోసిస్‌’ పద్ధతిలో మనుషులకు సంక్రమించి ఉంటుందని మరికొందరు శాస్త్రవేత్తలు తాజాగా ప్రకటించారు. ‘ఒమిక్రాన్‌’లోని కొన్ని అసాధారణమైన మ్యూటేషన్లే దీనికి ఆధారమని తెలిపారు. దీనిపై ఇంకా పూర్తి స్పష్టత రావాల్సి ఉందన్నారు. అమెరికాకు చెందిన స్క్రిప్స్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్, ట్యూలేన్‌ యూనివర్సిటీ, అరిజోనా యూనివర్సిటీల శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధన చేశారు.

ఏమిటీ ‘రివర్స్‌ జూనోసిస్‌’?
జంతువులు, పక్షుల్లో ఉండే కొన్నిరకాల వైరస్‌లు మనుషులకు కూడా సంక్రమిస్తుంటాయి. దీనిని ‘జూనోసిస్‌’ అంటారు. అలాంటి వైరస్‌లు కలుగజేసే వ్యాధులను ‘జూనోటిక్‌’ వ్యాధులు అంటారు. కరోనా వైరస్‌ కూడా ఇలా గబ్బిలాల నుంచి మనుషులకు సోకిన ‘జూనోసిస్‌’ వైరసే.

జంతువుల నుంచి మనుషులకు సోకి రూపు మార్చుకున్న (మ్యూటేట్‌ అయిన) వైరస్‌లు.. తిరిగి ఇతర జంతువులకు సోకడాన్ని ‘రివర్స్‌ జూనోసిస్‌’ అంటారు. ఇలా మనుషుల నుంచి జంతువులకు సోకిన వైరస్‌లు.. ఆయా జంతువులకు తగ్గట్టు మళ్లీ మ్యూటేట్‌ అవుతాయి. ఇలా మార్పులు జరిగాక రెండోసారి సులువుగా మనుషులకు వ్యాపించే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. 


 

2020 మధ్యలోనే ఎలుకలకు వెళ్లి..
కరోనా తొలివేవ్‌ సమయంలోనే అంటే 2020 సంవత్సరం మధ్యలోనే ఆ వైరస్‌ ఎలుకలకు వ్యాపించి ఉంటుందని.. అప్పటి నుంచీ వివిధ మ్యూటేషన్లు జరిగాక ఇప్పుడు మనుషులకు వ్యాపించి ఉంటుందని స్క్రిప్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ శాస్త్రవేత్త క్రిస్టియన్‌ అండర్సన్‌ తెలిపారు. ‘ఒమిక్రాన్‌’ వేరియంట్‌లో వచ్చిన మ్యూటేషన్లే దీనికి ఆధారమని వెల్లడించారు.

ఒమిక్రాన్‌లో కనిపించిన మ్యూటేషన్లలో ఏడు మ్యూటేషన్లు ఆ వైరస్‌ ఎలుకలకు సంక్రమించడానికి వీలు కల్పించేవేనని.. ఆల్ఫా, బీటా, డెల్టా సహా ఇతర వేరియంట్లలో ఈ తరహా మ్యూటేషన్లు పెద్దగా కనిపించలేదని ట్యూలేన్‌ యూనివర్సిటీ మెడికల్‌ స్కూల్‌ ప్రొఫెసర్‌ రాబర్ట్‌ గారీ తెలిపారు. అంతేకాదు ఇతర వేరియంట్లు వేటిలోనూ లేని కొన్ని అసాధారణ మ్యూటేషన్లు కూడా.. ఈ కొత్త వేరియంట్‌పై అనుమానాలు రేకెత్తిస్తున్నాయని చెప్పారు.

ఎందుకింత గందరగోళం?
సాధారణంగా ఏ వైరస్‌ అయినా.. వ్యాపిస్తూ వెళ్లినకొద్దీ మ్యూటేట్‌ అవుతూ వస్తుంది. ప్రతి కొత్త వేరియంట్‌లో దానికన్నా ముందటి వేరియంట్‌కు సంబంధించిన మ్యూటేషన్లతోపాటు, కొత్త మ్యూటేషన్లు కూడా కనిపిస్తాయి. కానీ ‘ఒమిక్రాన్‌’లో ప్రస్తుతమున్న వేరియంట్లలోని మ్యూటేషన్లు లేవని.. అంతేగాకుండా ఒక్కసారిగా అతి ఎక్కువగా కొత్త మ్యూటేషన్లు కనిపిస్తున్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అంటే కరోనా వ్యాప్తి మొదలైన కొత్తలోనే (ఆల్ఫా, బీటా, డెల్టా వేరియంట్లు పుట్టకముందే) విడివడిన ఒక వేరియంట్‌.. భారీగా మ్యూటేషన్లు జరిగాక తిరిగి వ్యాపించడం మొదలుపెట్టిందని అంటున్నారు.

చదవండి: OCD Wife: నావల్లకాదు మహప్రభో.. దయచేసి విడాకులిప్పించండి!.

చదవండి: Madhya Pradesh: ఎందు‘కని' పారేస్తున్నారు?

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top