రష్యా టీవీ లైవ్‌షోలో నిరసన.. మహిళా జర్నలిస్ట్‌కు 15 ఏళ్ల వరకు జైలు శిక్ష!

Russian Woman Protested Against Ukraine War On Live TV May Get 15 Years In Jail - Sakshi

యుద్ధం ఆపాలంటూ రష్యా టీవీ లైవ్‌ షోలో నిరసన తెలిపిన మహిళా జర్నలిస్ట్‌కు దాదాపు 15 ఏళ్లు జైలు శిక్ష విధించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మాస్కోలోని ఛానల్‌1లో పనిచేస్తున్న మెరీనా ఓవ్స్యానికోవా యుద్ధం ఆపాలని ప్లకార్డుతో రష్యాకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన వెంటనే పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల అదుపులో ఉన్న మెరీనా అనంతరం మీడియాతో మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియోను న్యూయార్క్‌ టైమ్స్‌ ట్విటర్‌లో పోస్టు చేసింది.

ఇందులో సదరు ఉద్యోగి ఉక్రెయిన్‌ రష్యా యుద్ధం మొదలైనప్పటి నుంచి తను చేసిన ప్రయత్నాలను వెల్లడించింది. ఆమె మాట్లాడుతూ.. తనను 14 గంటలపాటు పోలీసులు విచారించినట్లు తెలిపింది. తన కుటుంబాన్ని కలిసేందుకు కూడా అనుమతి ఇవ్వలేదని తెలిపింది. ‌అంతేగాక ఘటన తర్వాత పోలీసు కస్టడీలో ఉన్నప్పుడు న్యాయ సహాయం కూడా అందలేదని వాపోయింది. 
చదవండి: రష్యాకు కోలుకోలేని దెబ్బ.. ఆవేదనలో పుతిన్‌..!

‘ఉక్రెయిన్‌ రష్యా యుద్ధం భయంకరంగా సాగుతోంది. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నాను. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. నాకు మద్దతుగా నిలిచిన స్నేహితులు, సహోద్యోగులకు ధన్యవాదాలు. నా జీవితంలో ఇవి చాలా కఠినమైన రోజులు. రెండు రోజులుగా నిద్రపోలేదు’ అని తెలిపింది. అయితే రష్యా మహిళా జర్నలిస్ట్ నిరసన విషయం తెలిసిన యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఆమెకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

కాగా రష్యాలోని ఓ వార్తా ఛానెల్​లో జర్నలిస్ట్​ లైవ్​లోనే యుద్ధానికి వ్యతిరేకంగా నిరసన తెలిపిన విషయం తెలిసిందే. మరో జర్నలిస్ట్‌ వార్తలు చదువుతుండగా యుద్ధానికి వ్యతిరేకంగా ప్లకార్డు పట్టుకుని నిరసనను తెలిపింది. ‘యుద్ధం వద్దు.. యుద్ధాన్ని ఆపండి.. వాళ్లు ఇక్కడ అబద్దం చెబుతున్నారు. తప్పుడు ప్రచారాలను అసలు ఎవరూ నమ్మోద్దు’ అని  నిరసన వ్యక్తం చేసింది. దీంతో రష్యా టీవీ జర్నలిస్టు నిరసన తెలిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మెరీనా తండ్రి యుక్రెయిన్ దేశస్థుడు కావడంతో ఆమె మద్దతుగా నిరసన వ్యక్తం చేసింది. 
చదవండి: యుద్దం వేళ రష్యాతో భారత్‌ డీల్‌.. మోదీపై అక్కసు వెళ్లగక్కిన అమెరికా

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top