నర్వ్‌ స్టిమ్యులేషన్‌తో... పక్షవాతానికి చెక్‌!

People With Complete Paralysis Walk Again After Nerve Stimulation Breakthrough - Sakshi

జెనీవా: పక్షవాత రోగులకు శుభవార్త. నర్వ్‌ స్టిమ్యులేషన్‌ చికిత్స, మెరుగైన ఫిజియోథెరపీ ద్వారా పక్షవాతానికి చెక్‌ పెట్టడంలో వైద్య పరిశోధక బృందం విజయం సాధించింది. తొమ్మిది మంది పక్షవాత రోగులు ఈ రెండు చికిత్సల ద్వారా పూర్తిగా కోలుకుని తిరిగి నడవగలిగారు! వీరంతా వెన్నుముక తీవ్రంగా దెబ్బతినడం వల్ల పక్షవాతం బారిన పడ్డవారే! ఈ ప్రయోగాత్మక చికిత్స ఫలితం పట్ల పరిశోధకులు, వైద్యులు ఆనందం, ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ ప్రయోగం...
‘స్విస్‌ రీసెర్చ్‌ గ్రూప్‌ న్యూరో రీసెర్చ్‌’ అనే పరిశోధక బృందం ఇటీవల ఓ ప్రయోగం జరిపింది. దీన్ని తొలుత ఎలుకలపై జరిపిన అనంతరం మనుషులను ఎన్నుకుంది. వీరంతా ప్రమాదాల్లో నడకకు తోడ్పడే వెన్నెముక చివరి భాగంలోని కీలక నరాల సమూహమైన లంబార్‌ న్యూరాన్లు దెబ్బతిన్నవారే. దాంతో నడివాల్సిందిగా మెదడు ఇచ్చే ఆదేశాలు కాళ్లను చేరవు.

ఫలితం...? శాశ్వత పక్షవాతం! ఇలాంటి 9 మంది రోగులకు స్వీస్‌ ఫెడరల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ లాసెన్నేకు చెందిన క్లాడియా కేథీ అనే న్యూరో సైంటిస్ట్‌ బృందం ఎపిడ్యూరల్‌ ఎలక్ట్రికల్‌ స్టిమ్యులేషన్‌ ఇచ్చింది. తద్వారా నడకకు తోడ్పడే నరాలను ఉద్దీపింపజేసింది. ఇందుకోసం శస్త్రచికిత్స ద్వారా వెన్నుపాములో న్యూరో ట్రాన్స్‌మిటర్‌ అమర్చారు. దాని ద్వారా వెన్నెముక ఉత్తేజితమయ్యేలా చూశారు. దీంతోపాటు రొబో  టిక్‌ ప్రక్రియలతో ఫిజియోథెరపీ అందిస్తూ వచ్చారు. వారిని పలు దిశల్లో కదిలించడంతోపాటు నడిపించారు. దాంతో రోగులు ఐదు నెలల్లోనే నడవడం,వాకర్‌ సాయంతో మెట్లెక్కడం మొదలుపెట్టారు.

కొత్త మార్గం దొరికినట్టే...
ఎలుకలపై నిర్వహించిన అధ్యయనం ఆధారంగా ఆర్‌ఎన్‌ఏ సీక్వెన్సింగ్‌తో పాటు అక్కడి కణజాలం పనితీరుపై స్పేషియల్‌ ట్రాన్స్‌క్రిప్టోమెటిక్స్‌ టెక్నిక్‌ సాయంతో కేథీ బృందం అవగాహనకు వచ్చింది. ‘‘వెన్నెముకకు గాయమయ్యాక కోలుకునేందుకు ఎస్‌సీ బీఎస్‌ఎక్స్‌2, హెచ్‌ఓఎక్స్‌10 అనే న్యూరాన్లతో తయారైన కణజాలం సాయపడుతుందని గుర్తించాం.

బ్రెయిన్‌స్టెమ్‌ నుంచి అందే ఆదేశాలను అమల్లో పెట్టేందుకు వీలుగా ఈ నాడీ కణజాలం చాలా విలక్షణమైన రీతిలో అమరి ఉంది. నడకకు అవే దోహదపడ్డాయి’’ అని కేథీ వివరించారు. అయితే, ‘అత్యంత సంక్లిష్టమైన ఈ ప్రక్రియలో ఇది భాగం మాత్రమే. ఇంకా తెలుసుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ఎస్సీ టు ద పవర్‌ ఆఫ్‌ బీఎస్‌ఎక్స్‌2, హెచ్‌ఓఎక్స్‌10 కణజాలం పక్షవాతం తర్వాత కోలుకుని నడకకు దోహదపడే ప్రాథమిక అంశాలన్నది మా పరిశోధనలో తేలింది. పక్షవాత చికిత్సలో కొత్త పద్ధతులకు ఈ అవగాహన మార్గాలు తెరచినట్టే’’ అంటూ ముక్తాయించారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top