అంగారక గ్రహంపై ‘మొసలి వంతెన’.. అసలేంటి రహస్యం? | NASA Perseverance Rover Spots Crocodile Bridge On Mars | Sakshi
Sakshi News home page

అంగారక గ్రహంపై ‘మొసలి వంతెన’.. అసలేంటి రహస్యం?

May 10 2026 9:04 AM | Updated on May 10 2026 11:21 AM

NASA Perseverance Rover Spots Crocodile Bridge On Mars

అంగారక గ్రహంలో అత్యంత పురాతన ప్రాంతాన్ని నాసా గుర్తించింది. పెర్సెవరెన్స్ రోవర్.. ‘క్రొకోడైల్ బ్రిడ్జ్’గా పిలువబడే అద్భుతమైన భౌగోళిక ప్రాంతానికి సంబంధించి.. అద్భుతమైన 360 డిగ్రీల పనోరమిక్ దృశ్యాలను చిత్రీకరించింది. క్రొకోడైల్ బ్రిడ్జ్ అంటే.. ఇది జెజెరో క్రేటర్ (Jezero Crater) అంచున ఉన్న వంపు ఆకారంలో ఉన్న రాతి నిర్మాణం. ఈ ఉపరితలం మొసలి వీపును పోలి ఉండటంతో దీనికి ఆ పేరు పెట్టారు. రోవర్ తన Mastcam-Z కెమెరా సిస్టమ్ ద్వారా దృశ్యాలను బంధించింది.

ఈ ప్రాంతంలోని రాళ్లు దాదాపు 3.7 బిలియన్ సంవత్సరాల క్రితం (నోచియన్ కాలం) నాటివి. ఇవి సౌర కుటుంబంలోనే అత్యంత పురాతనమైనవిగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అంగారక గ్రహంపై టెక్టోనిక్ ప్లేట్లు లేకపోవడం వల్ల.. బిలియన్ల ఏళ్ల నాటి ఈ పురాతన శిలలు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది..

ఈ 360 డిగ్రీల పనోరమాను పెర్సీవరెన్స్ రోవర్ తన కెమెరా ద్వారా 980 చిత్రాలను కలిపి రూపొందించింది. మానవ కన్ను ఎలా చూస్తుందో అలాగే సహజ రంగుల్లో నాసా దీనిని విడుదల చేసింది. క్రొకోడైల్ బ్రిడ్జ్ అనేది జెజెరో క్రేటర్ నేల నుండి దాని అంచుకు వెళ్లే దారిలో ఒక ముఖ్యమైన మలుపు. ఈ ప్రాంతం నుంచి రోవర్ త్వరలో ‘లాక్ డి చార్మ్స్’గా పిలిచే మరో ప్రాంతంలోకి ప్రవేశించి.. పలు నెలల పాటు పరిశోధనలు కొనసాగించనుంది.

అంగారక గ్రహం ఏర్పడిన కొత్తలో వాతావరణం.. ఉపరితలం ఎలా ఉండేవి? అక్కడ జీవం మనుగడకు అనుకూల పరిస్థితులు ఉండేవో లేదో తెలుసుకోవడానికి ఈ టైమ్ క్యాప్సూల్స్ వంటి రాళ్లు శాస్త్రవేత్తలకు ఎంతో సహాయపడతాయి. జెజెరో క్రేటర్ ఒకప్పుడు సరస్సు, నది డెల్టాగా ఉండేదని శాస్త్రవేత్తల నమ్మకం.

భవిష్యత్తులో భూమికి తీసుకురావడం కోసం రోవర్ ఇక్కడి రాళ్లు, మట్టిని సేకరిస్తోంది. ఈ అద్భుతమైన 980 దృశ్యాల్లో 971 చిత్రాలను డిసెంబర్ 18, 2025, మిగిలిన 9 చిత్రాలను జనవరి 25, 2026న తీశారు. ఈ చిత్రాల్లో ఎర్రటి మైదానం, రాళ్లు, కొండ అంచులు కనిపిస్తున్నాయి. ఈ ఫోటోలను తీసిన Mastcam-Z కెమెరా జూమ్ చేయగలదు. 3D చిత్రాలను తీయగలదు.. చాలా దూరం నుండి రాతి పొరలను స్పష్టంగా పరిశీలించగలదు. మొత్తానికి.. ఈ 'క్రొకోడైల్ బ్రిడ్జ్' పనోరమా అంగారక గ్రహం రహస్యాలను ఛేదించడంలో కీలక అడుగుగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement