Suez Crisis: శుభవార్త, షిప్‌ కదిలింది: వీడియో

Massive ship blocking the Suez Canal has been freed Video Watch here - Sakshi

రోజుకు రూ.72వేల కోట్ల నష్టం

ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెను సవాల్‌

చిగురిస్తున్న ఆశలు

సాక్షి, న్యూఢిల్లీ : సూయజ్‌ కెనాల్‌లో  చిక్కుకున్న భారీ నౌక ప్రపంచవ్యాప్తంగా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. రోజుకు 72వేల కోట్ల రూపాయల చొప్పున గత వారం రోజులుగా  సంభవించిన నష్టం ప్రపంచ ఆర్థికవ్యవస్థను అతలాకుతలం చేసింది. ప్రపంచంలో పదోవంతు వ్యాపారం జరిగే సూయజ్ కెనాల్లో ఇరుక్కున్న ఈ భారీనౌకను దారిలోకి తీసుకొచ్చేందుకు మల్లగుల్లాలు పడుతున్నాయి. తాజాగా దీనికి సంబంధించిన ఒక గుడ్‌న్యూస్‌ ఊరటనిస్తోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పెను సవాల్‌గా భారీ కంటైనర్ షిప్‌ ఇపుడు పాక్షికంగా ముందుకు కదిలింది. తాజా పరిణామంతో ఈ ప్రతిష్టంభనకు త్వరలోనే తెరపడనుందనే ఆశలు భారీగా వ్యాపించాయి. షిప్పింగ్ సర్వీసెస్ ప్రొవైడర్ మారిటైమ్ సర్వీసెస్ సంస్థ ఇంచ్‌కేప్ ఈ వార్తను ధృవీకరించింది. ఈ మేరకు ‘ఎవర్ గివెన్’ నౌక కదిలిందంటూ సోమవారం సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేసింది.  అటు "ఇది శుభవార్త" అని సూయజ్ కెనాల్ అథారిటీ చైర్మన్ ఒసామా రాబీ మీడియాకు చెప్పారు. ఇంకా పూర్తి కాలేదు, కానీ కొంచెం కదిలిందని వెల్లడించారు. కానీ 400కి పైగా నౌకల ప్రతిష్టంభనకు ముగింపు ఎపుడనేదిమాత్రం స్పష్టం చేయలేదు. షిప్-ట్రాకింగ్ సిస్టం వెసెల్ ఫైండర్ వెబ్‌సైట్‌లో ఎవర్ గివెన్ స్టేటస్‌ను అండర్‌వేగా మార్చుకుందని, తద్వారా జలమార్గం త్వరలో తిరిగి తెరుచుకోనుందనే ఆశలు పెంచుతోందంటూ ఈజిప్ట్‌ టుడే మ్యాగజీన్‌  ట్వీట్‌ చేసింది. 

కాగా ఈ షిప్‌ను ముందుకు కదిలించే ప్రయత్నాలు నిలిపివేశామని సూయజ్ కెనాల్ అథారిటీ (ఎస్‌సిఎ) ఈ ప్రయత్నాన్ని వాయిదా వేశామని ఆదివారం ప్రకటించారు. తగినంత టగ్ శక్తి అమలయ్యే వరకు తదుపరి రిఫ్లోటింగ్ ప్రయత్నాన్ని సోమవారం సాయంత్రానికి వాయిదా వేయాలని నిర్ణయించింది. రాబోయే 24-48 గంటల్లో ఓడను తరలించే అవకాశం ముందని  కూడా షిప్పింగ్ డేటా, న్యూస్ కంపెనీ లాయిడ్స్ లిస్ట్ ఎడిటర్ రిచర్డ్ మీడే వ్యాఖ్యానించారు ఈ నేపథ్యంలో తాజా వార్తలు భారీ ఊరటనిస్తున్నాయి.

అటు వేల కిలోమీటర్ల ఇసుకలో ఆఫ్రికా నుంచి సినాయ్ పెనిన్సులా మధ్యలో ఉన్న ఈ కెనాల్‌లో చిక్కుకుపోయిన ఈషిప్‌ను ఎవర్ గ్రీన్ అనే పనామా షిప్పింగ్‌కి చెందిన నౌకని కదల్చలేని పరిస్థితిలో ఇక చేసేదిలేక డ్రెడ్జింగ్‌కూడా సిద్ధమవుతున్నట్లు ఒసామా రాబేయ్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ షిప్‌ను విడిపించేందుకు మరిన్ని టగ్‌బోట్లు అవసరమని ఈజిప్టు అధికారులు ఆదివారం నిర్ణయించారు. సుమారు 20వేల కంటైనర్లను తొలగించడానికి సన్నాహాలు ప్రారంభించారు. మరోవైపు రష్యా ఇప్పటికే సహాయాన్నిఅందించగా, అమెరికాతో సహా ఇతర దేశాలు కూడా ముందు కొస్తున్నాయి. ఈజిప్ట్ ప్రభుత్వం కోరితే సాయం చేయడానికి తాము సిద్దమంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే.

(సూయజ్ కెనాల్‌లో అడ్డం తిరిగిన భారీ నౌక.. గంటకు 3వేల కోట్ల నష్టం)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top