సూయజ్‌ కాలువ.. ఎవర్‌ గీవెన్‌ నౌక.. ఇప్పుడెక్కడుందో తెలుసా?

Ever Given Container Ship Crosses Suez Canal Again - Sakshi

Ever Given In Suez Canal Again ప్రపంచ వాణిజ్యంలో 15 శాతానికి పైగా నిర్వహించే సూయజ్‌ కాలువలో అడ్డంగా ఇరుక్కిపోయి ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ఎవర్‌ గీవెన్‌ నౌక ఇప్పుడెక్కడుంది. సూయజ్‌ నుంచి ఎవర్‌ గీవెన్‌ని తొలగించిన తర్వాత ఏం జరిగింది. 

సూయజ్‌లో ప్రమాదం
ప్రపంచంలోనే అత్యంత పెద్ద వాణిజ్య నౌకల్లో ఎవర్‌ గీవెన్‌ ఒకటి. దాదాపు 400 మీటర్ల పొడవైన ఈ నౌకలో ఒకేసారి 2.20 లక్షల టన్నుల సరుకును తరలించే వీలుంది. ఇంత భారీ నౌక మధ్యధర సముద్రం నుంచి ఎర్ర సముద్రం వైపు ప్రయాణిస్తూ 2021 మార్చి 23న కాలువలో కూరుకుపోయింది. పెనుగాలుల తీవ్రంగా కాలువలో అడ్డంగా ఇరుక్కుపోయింది. కూరుకుపోయిన నౌకను బయటకు తీసేందుకు ఆరు రోజుల సమయం పట్టింది. దీంతో ఆరు రోజుల పాటు ఈ కాలువ గుండా వాణిజ్య నౌకల రాకపోకలు నిలిచిపోయి బిలియన్‌ డాలర్ల నష్టం వాటిల్లింది.

మూడు నెలల తర్వాత
సూయజ్‌ కాలువ నుంచి బయటకు తీసిన తర్వాత ఎవర్‌గీవెన్‌ నౌకను సూయజ్‌ కెనాల్‌ అథారిటీ సీజ్‌ చేసింది. ఆరు రోజుల పాటు కెనాల్‌ బ్లాక్‌ అయినందుకు గాను 916 మిలియన్‌ డాలర్ల నష్టపరిహారం చెల్లించాలని కోరింది. దీంతో ఇటు సూయజ్‌ కెనాల్‌ అథారిటీ, ఎవర్‌గీవెన్‌ నౌక యాజమాన్యమైన షోయ్‌ కిసెన్‌ ఖైషా, ఇన్సురెన్స్‌ సంస్థల మధ్య చర్చలు జరిగాయి. మూడు నెలల చర్చల అనంతరం వీరి మధ్య 600 మిలియన్‌ డాలర్ల నష్టపరిహారం చెల్లించేందుకు  ఒప్పందం కుదిరింది.  ఎవర్‌గీవెన్‌ నౌకను జులై 7న రిలీజ్‌ చేశారు.

సూయజ్‌ టూ ఇంగ్లండ్‌
సూయజ్‌ కెనాల్‌ నుంచి రిలీజైన తర్వాత మరమ్మత్తులు నిర్వహించి జులై 29న హలండ్‌లోని రోటర్‌డ్యామ్‌కు చేరుకుంది,.అనంతరం ఇంగ్లండ్‌లోని ఫెలిక్స్‌టోవ్‌ పోర్టుకు చేరుకుంది, అక్కడ మరోసారి సరుకులు నింపుకుని వాణిజ్య ప్రయాణానికి రెడీ అయ్యింది.

ఆగస్టు 20న
ఇంగ్లండ్‌ నుంచి చైనాకు ప్రయాణమైన ఎవర్‌ గీవెన్‌ ఆగస్టు 20న మరోసారి సూయజ్‌ కాలువని దాటింది. మరోసారి ప్రమాదం జరగకుండా సూయజ్‌ కెనాల్‌ అథారిటీ జాగ్రత్తలు తీసుకుని. ఎవర్‌గీవెన్‌కు తోడుగా రెండు టగ్‌ బోట్లను కూడా పంపింది. ఎవర్‌గీవెన్‌తో పాటు ఒకేసారి 26 చిన్న నౌకలు సైతం సూయజ్‌ను దాటినట్టు ఈజిప్టు మీడియా పేర్కొంది.

22వ సారి
ఎవర్‌గీవెన్‌ నౌకను తైవాన్‌కు చెందిన తైవాన్‌కు చెందిన ఎవర్‌గ్రీన్‌ షిప్టింగ్‌ సంస్థ 2018లో తయారు చేసింది. ఈ భారీ నౌక అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక ప్రపంచ యాత్రలు చేసింది. సూయజ్‌ కాలువను 21వ సారి దాటే క్రమంలో మట్టి దిబ్బల్లో ఇరుక్కుపోయింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టి ఎవర్‌గీవెన్‌పై పడింది. ఆ వివాదం నుంచి బయటపడి విజయవంతంగా 22వ సారి సూయజ్‌ కాలువను దాటింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top