పుతిన్‌తో కిమ్‌ భేటీ.. ఇలా కూడా చేస్తారా.. వీడియో వైరల్‌ | Kim Jong Un Aides Erased DNA In Meeting Room After Talks With Putin Video Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

పుతిన్‌తో కిమ్‌ భేటీ.. జాగ్రత్త పడాల్సిందే.. వీడియో వైరల్‌

Sep 4 2025 8:23 AM | Updated on Sep 4 2025 9:28 AM

Kim Jong Un aides erased DNA after talks with Putin Video Viral

బీజింగ్‌: రష్యా, ఉత్తర కొరియా అధినేతలు పుతిన్, కిమ్‌ జోంగ్‌ ఉన్‌ చైనా రాజధాని బీజింగ్‌లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. బుధవారం విక్టరీ డే పరేడ్‌లో పాల్గొన్న అనంతరం స్టేట్‌ గెస్ట్‌ హౌస్‌లో కలుసుకున్నారు. భేటీ ప్రారంభం కావడానికి ముందు మీడియా ప్రతినిధులతో పుతిన్‌ మాట్లాడారు. అయితే, అనంతరం చోటుచేసుకున్న నాటకీయ పరిణామాలపై తీవ్ర చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే..

భేటీ అనంతరం పుతిన్‌-కిమ్ అక్కడి నుంచి వెళ్లిపోగానే.. వారు కూర్చున్న ప్రదేశం వద్దకు వేగంగా ఇద్దరు వ్యక్తులు దూసుకొచ్చారు. అందులో ఒకరు కిమ్ కూర్చున్న కుర్చీని తెగ తుడిచేశారు. ఉత్తరకొరియా అధ్యక్షుడికి సంబంధించిన ఎలాంటి ఆనవాళ్లు లేకుండా శుభ్రం చేశారు. ఆయన తాకిన ఫర్నీచర్‌ను క్లీన్‌ చేశారు. ఇంకొకరు ఆయన వాడిన గ్లాస్‌ అతి జాగ్రత్తగా ట్రేలో పెట్టుకొని తీసుకెళ్లిపోయారు. ఆయనకు సంబంధించిన ఎలాంటి ఆనవాళ్లు ఆ ప్రాంతంలో లేకుండా క్లీన్‌ చేసేశారు.

అయితే, ఇలా వ్యవహరించాడాని కారణంగా ఉందని రష్యా జర్నలిస్ట్‌ ఒకరు వెల్లడించారు.  ఆయన డీఎన్‌ఏ ఎవరికీ చిక్కకుండా ఉండేందుకు ఇలా చేశారని చెప్పుకొచ్చారు. కాగా, దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తమ ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు బయటకు చిక్కకుండా ప్రపంచ నేతలు ఇలా జాగ్రత్తలు పాటిస్తుంటారు.

పుతిన్‌ కూడా అంతే.. 
ఉక్రెయిన్‌తో యుద్ధం ముగింపుపై చర్చించేందుకు ఇటీవల అలాస్కాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో భేటీ అయిన సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇలాంటి జాగ్రత్తే తీసుకున్నారని వార్తలు వచ్చిన సంగతి  తెలిసిందే. పుతిన్‌ మల వ్యర్థాలను తీసుకెళ్లడానికి ప్రత్యేకంగా ఓ సూట్‌ కేసును ఆయన బాడీగార్డులు మోసుకెళ్లారట. ఆ పూప్‌ సూట్‌కేస్‌లో వాటిని సేకరిస్తారని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. అందుకు సంబంధించిన వీడియోలు కూడా బయటకు వచ్చాయి.  

ఇదిలా ఉండగా.. పుతిన్‌-కిమ్‌ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగినట్టు తెలిసింది. ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యా సైనికులతో కలిసి పోరాడుతున్న ఉత్తరకొరియా జవాన్లపై ప్రశంసల వర్షం కురిపించారు. రష్యా–ఉత్తర కొరియా మధ్య బంధం నానాటికీ బలపడుతోందని కిమ్‌ హర్షం వ్యక్తంచేశారు. గత ఏడాది జూన్‌లో ఇరుదేశాలు వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందంపై సంతకాలు చేశారని తెలిపారు. అప్పటి నుంచి పరస్పరం సహకరించుకుంటున్నాయని పేర్కొన్నారు. రష్యాకు, ఉత్తరకొరియా సహకరించడం సోదర దేశంగా తమ బాధ్యత అని వ్యాఖ్యానించారు. అవసరమైన సాయం అందించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామన్నారు.

అయితే, ఉక్రెయిన్‌పై యుద్ధం గురించి కిమ్‌ నేరుగా ప్రస్తావించలేదు. మీడియాతో మాట్లాడిన అనంతరం పుతిన్, కిమ్‌ ద్వైపాక్షిక అంశాలపై విస్తృతంగా చర్చించుకున్నారు. ఉక్రెయిన్‌పై యుద్ధంలో సహకరిస్తున్నందుకు కిమ్‌కు పుతిన్‌ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసినట్లు సమాచారం. రష్యాలో పర్యటించాలని కోరుతూ కిమ్‌ను పుతిన్‌ ఆహ్వానించారు. ఉక్రెయిన్‌పై యుద్ధం కోసం ఉత్తర కొరియా సైన్యం రష్యాకు అండగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఉత్తర కొరియా ఇప్పటిదాకా 15,000 మంది సైనికులను పంపించింది. బాలిస్టిక్‌ మిస్సైళ్లు, ముందుగుండు సామగ్రి సహా పలు కీలక ఆయుధాలను సైతం సరఫరా చేస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement