బ్రెజిల్‌ అధ్యక్ష భవనం, సుప్రీంకోర్టు భవనాల ఆక్రమణ.. ప్రపంచ దేశాధినేతల ఆందోళన

Ex President Bolsonaro Supporters Raids Brasilia Updates - Sakshi

రియో డీ జనీరియో: బ్రెజిల్‌ రాజధాని నగరం బ్రసీలియాలో మాజీ దేశాధ్యక్షుడు జైర్‌ బోల్సోనారో మద్దతుదారులు దురాక్రమణకు దిగారు. ఇటీవలి అధ్యక్ష ఎన్నికల్లో లూయిజ్‌ ఇన్సియో లూలా డ సిల్వా చేతిలో బోల్సోనారో ఓడిపోవడం జీర్ణించుకోలేని ఆయన మద్దతుదారులు ఆదివారం రాజధానిలోని అత్యంత కీలకమైన భవనాలపై దాడికి తెగించారు. దేశాధ్యక్షుడి అధికార నివాసం, కాంగ్రెస్, సుప్రీంకోర్టు భవనాల ముందున్న బారికేడ్లను బద్దలుకొట్టి, భవనాల గోడలెక్కి అద్దాలు, కిటికీలు ధ్వంసంచేశారు.

సుప్రీంకోర్టులో న్యాయమూర్తులు కూర్చొనే ప్రధాన బల్లాను ధ్వంసంచేశారు. కోర్టు ఆవరణలోని పురాతన విగ్రహాన్ని కూలదోశారు. ‘‘బోల్సోనారో నేతృత్వంలో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు సైన్యం చర్యలు తీసుకోవాలి. డ సిల్వాను దింపేయాలి’’ అని డిమాండ్‌చేస్తున్నారు. భవనాల్లో ఫర్నిచర్, కంప్యూటర్లనూ ధ్వంసంచేశారు. వారాంతం కావడంతో భవనాల్లో సిబ్బంది అంతగా లేరు.ఊహించని ఘటనతో ఉలిక్కిపడిన సైన్యం వెంటనే రంగ ప్రవేశం చేసింది.

భవనాల ప్రాంగణాల్లోని ఆందోళనకారులను చెదరగొట్టేందుకు టియర్‌ గ్యాస్‌లను ప్రయోగించింది. 300 మందిని అరెస్ట్‌చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చింది. అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని బోల్సోనారో ఒప్పుకోక మద్దతుదారులను ఉసిగొల్పడం ఇంతటి ఆందోళనకు కారణమైంది. రెండేళ్ల క్రితం అమెరికా పార్లమెంట్‌పై డొనాల్డ్‌ ట్రంప్‌ మద్దతుదారులు చేసిన దాడిని ఈ ఘటన గుర్తుకుతెచ్చింది.

ఫాసిస్టు శక్తుల విలయం: డసిల్వా
ఆందోళనలపై డ సిల్వా ఆగ్రహించారు. ‘‘ఫాసిస్ట్‌ శక్తులు చెలరేగిపోయాయి. దీనిపై సత్వరం స్పందించని పోలీసు అధికారులపై కఠిన చర్యలు తప్పవు’ అన్నారు. ఇలాంటి ఘటన జరిగే ప్రమాదముందని కొన్నినెలలుగా రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తుండటం గమనార్హం. గత ఏడాది అక్టోబర్‌ 30న డ సిల్వా గెలుపు తర్వాత మొదలైన నిరసనలు ఆనాటి నుంచి ఆగలేదు. రోడ్ల దిగ్బంధం, వాహనాల దగ్ధం, సైన్యం జోక్యంచేసుకోవాలంటూ సైనిక కార్యాలయాల వద్ద ఆందోళనకారుల బైఠాయింపులతో నిరసనలు దేశమంతటా కొనసాగుతుండటం తెల్సిందే.
 

ప్రపంచ దేశాధినేతల ఆందోళన
బ్రెజిల్‌లో అధికార కేంద్రాలైన ప్రధాన భవనాలపై దాడిని పలు ప్రపంచ దేశాలు ఖండించాయి. ‘ప్రజాస్వామ్యాన్ని కూలదోసే ప్రతి చర్యనూ ఖండిస్తాం. పాలనలో అధ్యక్షుడు డ సిల్వాకు సాయంగా ఉంటాం’ అని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ వ్యాఖ్యానించారు. ‘ ఎన్నికల ద్వారా డ సిల్వా ప్రభుత్వాన్ని ఎన్నుకున్న ప్రజాభిష్టాన్ని గౌరవించాలి’ అంటూ దాడులను ఐరాస ప్రధాన కార్యదర్శి గుటెరస్‌ తీవ్రంగా తప్పుబట్టారు. ఘటనపై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తంచేశారు. ఆందోళనకారులనుద్దేశిస్తూ.. ‘ఎన్నికలు అనే ప్రజాస్వామ్య సంప్రదాయాలను అందరూ గౌరవించాల్సిందే. ఈ విషయంలో డ సిల్వా సర్కార్‌కు మా పూర్తి మద్దతు ఉంటుంది’ అని మోదీ అన్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top