
ఆస్ట్రేలియా తీరంలో శిలజాన్ని గుర్తించిన సైంటిస్టులు
వెల్లింగ్టన్: సముద్రాల్లో తిరుగాడే తిమింగలం పరిమాణం ఎంత ఉంటుందో మనకు తెలుసు. భారీ ఆకారంతో టన్నుల కొద్దీ బరువుండే తిమింగలాలు ఉన్నాయి. కానీ, ప్రాచీన కాలంలో బుల్లి తిమింగలాలు ఉండేవని పరిశోధకులు గుర్తించారు. 2.5 కోట్ల సంవత్సరాల క్రితం నాటి తిమింగలం శిలాజం ఆస్ట్రేలియా సముద్ర తీరంలో లభించింది. దీనికి జంజూసిటస్ డులార్డి అని పేరు పెట్టారు.
ఇది చాలా అరుదైన తిమింగలం అని చెబుతున్నారు. తిమింగలాల పరిణామ క్రమాన్ని తెలుసుకోవడానికి తోడ్పడుతుందని అంచనా వేస్తున్నారు. ఇది ఎంత చిన్నది అంటే సింగిల్ బెడ్‌కు సరిగ్గా సరిపోతుంది. దాని కండ్లు టెన్నిస్ బంతుల సైజ్‌లో ఉన్నాయి. పదునైన దంతాలు కనిపిస్తున్నాయి. అంటే ఇవి ఆహారం కోసం సముద్రంలో ఇతర జీవులను వేటాడేవని తెలుస్తోంది. దీని ముఖం కార్టూన్ క్యారెక్టర్ ముఖాన్ని పోలి ఉంది. బుల్లి తిమింగలాలు ఎలా అంతరించిపోయాయన్నది తెలుసుకోవడానికి సైంటిస్టులు ప్రయత్నిస్తున్నారు.