వంటనూనెతో నింగిలోకి..

An Airbus A380 Just Flew Powered By Cooking Oil - Sakshi

వంట నూనెల ధరలు ఆకాశాన్నంటుతున్న వేళ... ప్రపంచంలోనే అతిపెద్ద ప్యాసింజర్‌ విమానం జెట్‌ఇంధనంతోకాకుండా వంటనూనెతో నింగిలోకి ఎగిరింది. అది ఎప్పుడు ఎక్కడ టేకాఫ్‌ అయింది... ఇదెలా సాధ్యమనే ఆసక్తికర విషయాలేంటో తెలుసుకుందాం... 
–సాక్షి, సెంట్రల్‌ డెస్క్‌ 

సూపర్‌ జంబో విమానం ఎయిర్‌బస్‌ ఏ–380 వంటనూనెతో ఆకాశంలోకి ఎగిరి మూడు గంటలపాటు చక్కర్లు కొట్టింది. ఈ విమానం ఇటీవల ఫ్రాన్స్‌లోని టౌలూస్‌ బ్లాగ్నక్‌ విమానాశ్రయంలో వంటనూనెతో తయారుచేసిన సస్టెయినబుల్‌ విమాన ఇంధనాన్ని (ఎస్‌ఏఎఫ్‌) 27 టన్నుల వరకు నింపుకుని టేకాఫ్‌ అయింది. మూడు గంటల తర్వాత నైస్‌ విమానాశ్రయంలో విజయవంతంగా ల్యాండయింది. ఈ విమానం 100 శాతం ఎస్‌ఏఎఫ్‌తో నింగిలోకి ఎగరడం ఇదే తొలిసారి కావడం విశేషం.  

కొవ్వులు, ఇతర వ్యర్థాలతో.. 
హరిత, మునిసిపల్‌ వ్యర్థాలు,కొవ్వులతో తయార య్యే ఈ ఎస్‌ఏఎఫ్‌ ఇంధనం దాదాపు 80 శాతం కా ర్బన్‌డయాక్సైడ్‌ను తగ్గిస్తుంది. ఏవియేషన్‌ పరిశ్రమ 2050 నాటికల్లా కర్భన ఉద్గారాలను జీరో లక్ష్యంగా పెట్టుకోగా,యూకే ప్రభుత్వం 2030 నాటికి 10 శా తం ఎస్‌ఏఎఫ్‌ను వినియోగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. గత ఏడాదికాలంలో ఏ380తోపాటు మూడు విమానాలు 100 శాతం వంటనూనెతో నింగిలోకి ఎగిరాయి. 2021 మార్చిలో ఏ350, అక్టోబర్‌లో ఏ319నియో విమానాలు ఇలా ఎఫ్‌ఏఎఫ్‌తో చక్కర్లు కొట్టాయి.  

ధర ఐదు రెట్లు ఎక్కువ... 
సంప్రదాయ విమాన ఇంధనంతో పోలిస్తే ఈ హరిత జెట్‌ ఇంధనం ధర ఐదు రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఈ ఇంధనాన్ని వాడితే విమాన టికెట్ల ధరలు కూడా ఎక్కువ అవుతాయని, అయితే ప్రభుత్వాలు సబ్సిడీలిచ్చి ఆదుకుంటే ధరలు పెంచాల్సిన అవసరం ఉండదని విశ్లేషకులు అంటున్నారు. 2030 నాటికి 13 హరిత విమాన ఇంధనం ప్లాంట్లను నెలకొల్పాలని యూకే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఒక్కో ప్లాంట్‌కు సుమారు రూ.2,280 కోట్లు వ్యయమవుతుంది.  

ఎస్‌ఏఎఫ్‌ వినియోగం పెరిగిందంటే జీరో కర్భన ఉద్గారాల లక్ష్యానికి చేరువవుతున్నట్లే అని ఎయిర్‌బస్‌ సంస్థ పేర్కొంది. తమ విమానాలన్నింటిని 50శాతం ఎస్‌ఏఎఫ్‌–కిరోసిన్‌ మిశ్రమంతో నడిపేందుకు అనుమతి ఉందని చెప్పింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి 200 బిలియన్‌ లీటర్ల విమాన ఇంధనం అవసరం అవుతుండగా, గత ఏడాది 10–12 కోట్ల లీటర్ల ఎస్‌ఏఎఫ్‌ మాత్రమే ఉత్పత్తి అయిందని అంతర్జాతీయ వైమానిక సంస్థ ఐఏటీఏ అంచనావేసింది. ఇది మొత్తం డిమాండ్‌లో 0.05 శాతం మాత్రమేనని చెప్పింది. శిలాజ ఇంధనాలతో పోలిస్తే ఇలాంటి జీవఇంధనాలతో కాలుష్యం తక్కువగా ఉంటుంది. అందుకే ఎస్‌ఏఎఫ్‌ వాడకాన్ని పెంచాలని వైమానిక సంస్థలు ప్రణాళికలు వేస్తున్నాయి.

ఎలా మారుస్తారు? 
మనం వాడుతున్న వంటనూనెను అలాగే విమాన ఇంధనంగా వాడలేం. వాడిన వంటనూనెకు కొన్నిరకాల మిశ్రమాలు కలిపి కొంత ప్రాసెస్‌ చేసి జీవఇంధనంగా మారుస్తారు. జీఎఫ్‌ కమ్యూనికేషన్స్‌ సంస్థ ప్రకారం వాడిన ఆలివ్, కనోలా నూనెలు దీనికి బాగా పనికొస్తాయి. ఎందుకంటే అవి తాజా నూనె కన్నా కూడా బాగా చిక్కగా ఉంటాయి.

విమాన ఇంధనంగా మార్చేందుకు ముందుగా వాడిన నూనెను వడబోసి అందులో ఉన్న వ్యర్థాలను తొలగిస్తారు. తర్వాత దాన్ని 70ఫారన్‌హీట్‌ వరకు వేడిచేస్తారు. తర్వాత కొంచెం ఆల్కహాల్, సోడియం క్లోరైడ్‌ తదితరాలను జతచేస్తారు. ఈ మిశ్రమంతో రెండు రకాల ఉత్పత్తులు అంటే మీథైల్‌ ఈస్టర్, గ్లిసరిన్‌ తయారవుతాయి. బయోడీజిల్‌ (జీవఇంధనం) రసాయన నామం మీథైల్‌ ఈస్టర్‌. గ్లిసరిన్‌ను సబ్బులతోపాటు చాలారకాల ఉత్పత్తుల తయారీకి వాడతారు.    

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top