Afghanistan: తాలిబన్ల తొలి మీడియా సమావేశం.. కీలక వ్యాఖ్యలు

Afghanistan: Taliban First Press Meet Says They Dont Want Enemies - Sakshi

తాలిబన్ల తొలి మీడియా సమావేశం.. శాంతిని కోరుకుంటున్నాం

కాబూల్‌: అఫ్గనిస్తాన్‌ను వశం చేసుకున్న అనంతరం తాలిబన్లు తొలిసారి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తాలిబన్‌ అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్‌ మాట్లాడుతూ... ‘‘20 ఏళ్ల తర్వాత విదేశీ సైన్యాన్ని తరిమికొట్టాం. అంతర్గతంగా, బయట నుంచి శత్రుత్వం కోరుకోవడంలేదు. మహిళల హక్కులకు ఎలాంటి భంగం కలగనివ్వం’’ అని పేర్కొన్నారు. తాము అందరినీ క్షమించామని, ఎవరి  మీదా ప్రతీకారం ఉండదని తేల్చి చెప్పారు. ప్రజల ఇళ్లలో సోదాలు, దాడులు ఉండవని వెల్లడించారు.

అదే విధంగా... ‘‘అఫ్గన్‌లో ఇతర దేశీయులకు హాని తలపెట్టబోము. కాబూల్‌ ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నవారు వెనక్కి రావాలి. ఇస్లామిక్ చట్టాల ప్రకారం మహిళలకు అన్ని హక్కులు కల్పిస్తాం. ఎలాంటి వివక్ష చూపబోం. వైద్య, ఇతర రంగాలలో వారు పనిచేయవచ్చు. అలాగే మీడియాపై ఎలాంటి ఆంక్షలు విధించం’’ అని ముజాహిద్‌ వ్యాఖ్యానించారు. ఈ మేరకు స్థానిక టోలోన్యూస్‌తో మాట్లాడుతూ తాము అవలంబించబోయే వైఖరి గురించి మంగళవారం వెల్లడించారు.

అలాగే అన్ని మీడియా సంస్థలు తమ కార్యకలాపాలను కొనసాగించాలని  కోరుకుంటున్నామని ముజాహిద్ తెలిపారు. అయితే మీడియాకు మూడు కీలక సూచనలు చేశారు. ‘‘ఏ ప్రసారమూ ఇస్లామిక్ విలువలకు విరుద్ధంగా ఉండకూడదు. నిష్పక్షపాతంగా ఉండాలి.  జాతీయ ప్రయోజనాలకు విరుద్ధంగా ఏదీ  ప్రసారం చేయకూడదని సూచించారు. ప్రజల జీవనోపాధిలో మెరుగుదలకు కృషిచేస్తాం’’ అని చెప్పారు.

చదవండి: Afghanistan: ‘వాళ్ల కోసమే వెయిటింగ్‌.. వచ్చి నన్ను చంపేస్తారు’
అఫ్గన్‌లో సాధారణ వాతావరణం: ఎందుకో అనుమానంగానే ఉంది!

 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top