డెంగీ వ్యాధిపై అప్రమత్తంగా ఉండాలి
● జిల్లా మలేరియా విభాగం అధికారి రజిని
దేశాయిపేట: నగర ప్రజలు డెంగీ వ్యాధిపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా మలేరియా విభాగం అధికారి కె.రజనీ సూచించారు. వరంగల్ డీఎంహెచ్‌ఓ డాక్టర్ సాంబశివరావు ఆదేశాల మేరకు దేశాయిపేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని నజ్రేతుపురంలో నమోదైన డెంగీ బాధితుడి ఇంటిని రజనీతో పాటు జిల్లా డిప్యూటీ మాస్ మీడియా అధికారి అనిల్‌కుమార్ సోమవారం క్షేత్రస్థాయిలో పర్యటించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని, ఇంటి పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా రజనీ మాట్లాడుతూ ఇంటి చుట్టుపక్కల నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని చెప్పారు. దోమల నివారణకు తగు చర్యలు తీసుకోవాలని వివరించారు. అనిల్‌కుమార్ మాట్లాడుతూ ప్రజలు కూడా తమ సామాజిక బాధ్యతలో భాగంగా వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతను విధిగా పాటించాలని కోరారు. కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారులు సదానందం, విజయేంద్రకుమార్, మున్సిపల్ హెల్త్ సూపర్‌వైజర్ మధుకర్, సిబ్బంది రవి తదితరులు పాల్గొన్నారు.


