నిందితులను కఠినంగా శిక్షించాలి
మృతుడి కుటుంబీకుల డిమాండ్
కుమారస్వామి మృతదేహంతో ఆర్టీఏ జంక్షన్ వద్ద ఆందోళన
ఖిలా వరంగల్: తన భూమిని కబ్జా చేశారంటూ వరంగల్ కరీమాబాద్‌కు చెందిన పోలెపాక కుమారస్వామి(55) మనస్తాపంతో ఈనెల 9వ తేదీన శరీరంపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో హైదరాబాద్‌లో ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం మృతి చెందగా.. సోమవారం సాయంత్రం వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై ఆర్టీఏ జంక్షన్ వద్ద కుమారస్వామి మృతదేహంతో కుటుంబ సభ్యులు, బంధువులు ధర్నా నిర్వహించారు.
కబ్జాకు పాల్పడిన బండి కుమారస్వామి, పులి రంజిత్ రెడ్డి, తాళ్ల మల్లేశంను కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీంతో వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఈ విషయం తెలిసిన మామునూరు, మిల్స్‌కాలనీ పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో మృతుడి కుటుంబ సభ్యులు ఆందోళన విరమించారు.


