
సుందరీమణుల పర్యటనకు భారీ భద్రత
వరంగల్ క్రైం: మిస్ వరల్డ్ పోటీలను పురస్కరించుకొని హెరిటేజ్ పర్యటనలో భాగంగా నేడు (బుధవారం) గ్రేటర్ వరంగల్‌లో సుందరీమణుల పర్యటనకు భారీ భద్రత ఏర్పాట్లు చేసినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ పేర్కొన్నారు. మంగళవారం కమిషనరేట్‌లో సంబంధిత పోలీస్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ప్రపంచ సుందరీమణుల భద్రతకు కమిషనరేట్ పరిధిలో వెయ్యి మందికి పైగా పోలీసులు విధులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ముగ్గురు డీసీపీలు, ఒక అదనపు డీసీపీ, ఏసీపీలు–11, ఇన్‌స్పెక్టర్లు–32, ఎస్సైలు–81, ఏఎస్సై/హెడ్ కానిస్టేబుల్–155, కానిస్టేబుళ్లు–325, మహిళా పోలీసులు–106, హోంగార్డ్స్ 210తో పాటు డిస్ట్రిక్ గార్డ్స్, బాంబ్ డిస్పోజబుల్, డాగ్ స్క్వాడ్ విభాగాలకు చెందిన అధికారులు భద్రత ఏర్పాట్లలో పాల్గొనున్నట్లు వివరించారు. నగరంలో అదనపు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. సుందరీమణుల పర్యటనలో ఎలాంటి సమస్యలు రాకుండా సెక్టార్ల వారీగా ఇన్‌చార్జ్ పోలీస్ అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు.
సీపీ సన్‌ప్రీత్ సింగ్