
కల్తీ, కాలంచెల్లిన ఐస్‌క్రీమ్ ఉత్పత్తుల స్వాధీనం
ఖిలా వరంగల్: ఐస్‌క్రీమ్ డిస్ట్రిబ్యూటర్ షాపుపై దాడిచేసి రూ.93,200ల విలువైన కల్తీ, కాలం చెల్లిన ఐస్ క్రీమ్ ఉత్పత్తులను స్వాధీన పర్చుకుని, షాపు నిర్వాహకుడిపై కేసు నమోదు చేసినట్లు టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ జి.బాబులాల్ తెలిపారు. మామునూరు పోలీస్ స్టేషన్ పరిధి నాయుడు పెట్రోల్‌బంక్ సమీపంలో ఏనుగంటి సురేష్ ఐస్ క్రీమ్ డిస్ట్రిబ్యూటర్ షాపులో కల్తీ, కాలం చెల్లిన ఐస్ క్రీమ్ ఉత్పత్తులను విక్రయిస్తున్నట్లు పక్కా సమాచారం టాస్క్‌ఫోర్స్ ఏసీపీ మధుసూదన్‌కు అందింది. ఆయన ఆదేశాల మేరకు శుక్రవారం మధ్యాహ్నం ఆ షాపుపై టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ బాబులాల్ ఆధ్వర్యంలో ఫుడ్ ఇన్‌స్పెక్టర్ కృష్ణమూర్తి నేతృత్వంలో దాడి చేశారు. నిల్వ చేసిన రూ.93,200ల విలువైన కల్తీ, కాలం చెల్లిన ఐస్‌క్రీమ్ ఉత్పత్తులను స్వాధీన పర్చుకుని, వ్యాపారి సురేష్‌పై కేసు నమోదు చేసి తదిపరి చర్యల నిమిత్తం కేసును మామునూరు పోలీసులకు అప్పగించినట్లు ఇన్‌స్పెక్టర్ బాబులాల్ తెలిపారు.