
మాట్లాడుతున్న పొన్నం ప్రభాకర్, చిత్రంలో నాయిని, నమిండ్ల తదితరులు
మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్
హన్మకొండ చౌరస్తా: ఆదానీ ముసుగులో ప్రజల సొమ్మును దోపిడీ చేస్తున్న తీరును ఆధారాలతో సహా బయటపెడితే, సమాధానం చెప్పలేక భయాందోళనకు గురైన మోదీ.. రాహుల్‌గాంధీపై అనర్హత వేటు వేసి అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. రాహుల్‌గాంధీపై అనర్హత వేటుకు నిరసనగా శుక్రవారం హనుమకొండలో ‘జైభారత్ సత్యాగ్రహం’నినాదంతో చేపట్టిన కార్యక్రమానికి టీపీసీసీ ప్రతినిధిగా పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన డీసీసీ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. అక్రమాలపై పార్లమెంటులో చర్చించాలని పట్టుబడితే రాహుల్‌పై రాజకీయ కక్షతో అనర్హత వేటు వేయడంతో పాటు లోక్‌సభలో ఆయన ప్రసంగాన్ని తొలగించడం అప్రజాస్వామ్యని అన్నారు. భారత ప్రజాస్వామ్యాన్ని నిర్మించడానికి గాంధీ కుటుంబం రక్తాన్ని చిందించిందన్నారు. మరోసారి దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడి, విద్వేషాలు తొలగిపోయి దేశమంతా ఒకతాటిపైకి తెచ్చేందుకు రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారన్నారు. ఈ యాత్రతో ప్రజలకు రాహుల్‌గాంధీ దగ్గరైతే బీజేపీ జీర్ణించుకోలేకపోయిందని మండిపడ్డారు. సమావేశంలో హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, వర్ధన్నపేట నియోజకవర్గ కోఆర్డినేటర్ నమిండ్ల శ్రీనివాస్, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, నాయకులు కూచన రవళి, కార్పొరేటర్లు తోట వెంకటేశ్వర్లు, పోతుల శ్రీమన్నారాయణ, నాయకులు బక్క జడ్సన్, అయూబ్, సరళ, డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ, బొమ్మతి విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.