
హనుమకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్
హన్మకొండ/విద్యారణ్యపురి: ఈ నెల 3 నుంచి 13వ తేదీ వరకు నిర్వహించే పదవ తరగతి పరీక్షలకు జిల్లాలో పకడ్బందీ ఏర్పాట్లు చేశామని, విద్యార్థులు ఒత్తిడి, ఆందోళనకు గురికాకుండా పరీక్షలు రాయాలని హనుమకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ మీటింగ్ హాల్‌లో పదవ తరగతి పరీక్షల ఏర్పాట్లపై సమీక్ష సమావేశం జరిగింది. ప్రతి పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, విద్యార్థులు పరీక్షలు రాసేందుకు అవసరమైన డ్యూయల్ డెస్క్‌లను అందుబాటులో ఉంచామని వివరించారు. వేసవి దృష్ట్యా ప్రతి కేంద్రంలో అవసరమైన ఔషధాలతో ఏఎన్‌ఎం ఆధ్వర్యంలో వైద్యబృందం అందుబాటులో ఉంటుందన్నారు. ప్రతి కేంద్రం వద్ద, ప్రశ్నపత్రాల తరలింపులో అవసరమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. హాల్ టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయని, అవసరమైన వారు బీఎస్‌ఈ.తెలంగాణ.జీఓఈ.ఇన్ వెబ్‌సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు. ఏమైనా సందేహాలు ఉంటే కంట్రోల్ రూమ్ నంబర్ 0870–2930301లో సంప్రదించాలని కోరారు. సమావేశంలో డీఈఓ అబ్దుల్ హై, అసిస్టెంట్ కమిషనర్ చలపతిరావు, రూట్ ఆఫీసర్లు, విద్యా శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
వేడుకలకు ఏర్పాట్లు చేయాలి..
హన్మకొండ: మహానీయులు బాబూ జగ్జీవన్ రామ్, బీఆర్ అంబేడ్కర్ జయంతి వేడుకలకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం హనుమకొండ కలెక్టరేట్‌లో జయంతి వేడుకలపై డీఆర్‌ఓ వాసుచంద్ర, జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారి నిర్మల, ఎస్సీ, ఎస్టీ కుల సంఘాలతో సమీక్షించారు. మహనీయుల గురించి తెలిసేలా పిల్లలకు వ్యాసరచన పోటీలు నిర్వహించాలన్నారు. ప్రజా సంఘాల నాయకులు రవి, ప్రవీణ్ కుమర్, చుంచు రాజేందర్, ఎ. శ్రీనివాస్ పాల్గొన్నారు.
సమ్మర్ క్యాంపులను
సద్వినియోగం చేసుకోవాలి
జిల్లా క్రీడలు, యువజన శాఖ ఆధ్వర్యంలో వేసవిలో నిర్వహించనున్న క్రీడా శిక్షణ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నా యక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహ్మద్ అజీజ్ ఖాన్ పిలుపునిచ్చారు. శుక్రవారం హనుమకొండ కలెక్టరేట్ సమావేశ మందిరంలో వేసవి క్రీడా శిక్షణ కార్యక్రమ సన్నాహక సమావేశం జరిగింది. నాలుగో తరగతి నుంచి ఇంటర్ స్థాయి విద్యార్థులకు 15 క్రీడాంశాల్లో కోచ్‌లతో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అధికారులు జి.అశోక్ కుమార్, అబ్దుల్ హై, కైలాసం యాదవ్, కె.సారంగపాణి, పి.రమేష్ రెడ్డి, ఎండీ కరీం పాల్గొన్నారు.