
సాక్షిప్రతినిధి, వరంగల్: ఉద్యోగం కోసం అహోరాత్రులు ప్రిపేర్ అయిన విద్యార్థులు, అభ్యర్థులు నిరాశ, నిస్పృహలనుంచి ఇప్పుడిప్పుడే బయట పడుతున్నారు. పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, జనగామ, మహబూబ్‌నగర్ తదితర జిల్లాలకు చెందిన అనేక మంది గ్రేటర్ వరంగల్‌లో ఇళ్లు అద్దెకు తీసుకుని గ్రూప్స్ కోసం ప్రిపేరయ్యారు. కొందరు అప్పులు చేసి.. మరికొందరు ప్రైవేటు ఉద్యోగాలు మానుకుని.. ఏడాదినుంచి రెండేళ్ల పాటు రేయింబవళ్లు కష్టపడ్డారు. పేపర్ లీకేజీ వివాదంతో పరీక్షలు రద్దు కాగా, చేయని తప్పుకు శిక్ష అనుభవించిన అభ్యర్థులు ఇప్పుడిప్పుడే కోలుకుంటూ మళ్లీ తమ లక్ష్యమైన ఉద్యోగసాధనపై దృష్టి పెట్టారు.
మళ్లీ ప్రిపరేషన్‌లో అభ్యర్థులు
టీఎస్‌పీఎస్సీ నిర్వాకంతో గ్రూప్– 1 ప్రిలిమ్స్, అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ), అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ), డీఏవో పరీక్షలను రద్దు చేశారు. టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. ఉమ్మడి వరంగల్‌కు చెందిన సుమారు రెండు లక్షల మంది వరకు వివిధ పరీక్షలకు సిద్ధమయ్యారు. ప్రభుత్వం 80వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నామని గతేడాది చేసిన ప్రకటనతో విద్యార్థులు, నిరుద్యోగులు వరంగల్ నగరానికి వచ్చి ప్రిపరేషన్ మొదలు పెట్టారు. నాలుగు పరీక్షలకు అటెండ్ కాగా, గ్రూప్– 1 ప్రిలిమ్స్‌లో 2,500 మందికి పైగా క్వాలిఫై అయ్యారు. వాళ్లంతా మళ్లీ మెయిన్స్ కోసం సిద్ధమవుతున్న తరుణంలో లీకేజీ వివాదంతో పరీక్షలు రద్దు కావడం నిరాశకు గురి చేసింది. ఇదే సమయంలో రద్దు చేసిన ఏఈఈ నియామక పరీక్షల తేదీలను టీఎస్‌పీఎస్సీ ఈ నెల 29న ప్రకటించింది. మే 8న ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మే 9న అగ్రికల్చర్, మెకానికల్ ఏఈఈ ఆన్‌లైన్ పరీక్ష, మే 21న సివిల్ ఏఈఈ ఓఎంఆర్ పరీక్ష నిర్వహించినున్నట్లు తెలిపింది. దీంతో విద్యార్థులు, నిరుద్యోగులు మళ్లీ పోటీ పరీక్షలకు సిద్దమవుతున్నారు. దీంతో నగరంలోని లైబ్రరీలు కిటకిటలాడుతున్నాయి. కోచింగ్ సెంటర్లకు క్యూ కడుతున్నారు.
ఆశల పల్లకిలో పోటీ పరీక్షల అభ్యర్థులు
పేపర్ లీక్, పరీక్షల వాయిదాతో
అయోమయం
ప్రిలిమ్స్‌లో నెగ్గినా..
పరిస్థితి మళ్లీ మొదటికి
టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ కోసం
ఎదురుచూపులు
నగరంలోని యూనివర్సిటీ,
లైబ్రరీలు మళ్లీ కిటకిట
ఇళ్లు అద్దెకు తీసుకుని ప్రిపరేషన్
ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి పేరు తాళ్లపెల్లి సంపత్, పెద్దపెల్లి జిల్లా ఓదెల మండలం కనగర్తి గ్రామానికి చెందిన ఈయన కేయూలో ఎంఏ పొలిటికల్ సైన్స్ పూర్తిచేశాడు. ఏడాదిన్నర కాలంగా గ్రూప్1కు ప్రిపేర్‌అయ్యాడు. 2022లో జరిగిన గ్రూప్ ప్రిలిమ్స్‌లో 87 మార్కులతో మెయిన్స్‌కు ఎంపికయ్యాడు. ఇంతలోనే పేపర్ లీకేజీతో గ్రూప్–1 రద్దు చేయడంతో ఇతని ఆశలు అడియాశలయ్యాయి. ఏడాదిన్నరనుంచి ఇంటిముఖం కూడా చూడకుండా ప్రిపేరయ్యానని వాపోయిన సంపత్.. మళ్లీ మొదటినుంచి చదువుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు.
మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన వి.మహేష్ కాకతీయ యూనివర్సిటీలో ఎంఏ తెలుగు పూర్తిచేశాడు. యూనివర్సిటీ సమీపంలో ఇల్లు అద్దెకు తీసుకొని వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాడు. గ్రూప్–1 ప్రిలిమ్స్‌లో 77 మార్కులతో అర్హత సాధించి మెయిన్స్‌కు సిద్ధమవుతున్న సమయంలో పేపర్ లీకేజీ వ్యవహారం బయటికి రావడంతో పరీక్ష రద్దు చేశారు. మళ్లీ ప్రిపేర్ కావడానికి ఖర్చు వస్తుందన్న మహేష్.. తల్లితండ్రులపై భారం మోపడమే అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

