
సాక్షిప్రతినిధి, వరంగల్:
Ì గ్రేటర్ వరంగల్‌లోని శ్రీరంగనాయకస్వామి ఆలయానికి 14.21 ఎకరాల భూమి ఉంది. భూమలు ధరలు పెరగడం మొదలైన తర్వాత ఈ ఆలయం చుట్టూ ఆక్రమణలు జరిగాయి. సర్వేలో భాగంగా తాజాగా కొలతలు వేస్తే 4.17 ఎకరాల భూమే ఉంది.
Ì ప్రభుత్వ రికార్డుల ప్రకారం హనుమకొండలోని శ్రీపద్మాక్షి ఆలయం పేరిట 72, 73 సర్వేనంబర్లపై 72.23 ఎకరాల భూమి ఉండాలి. ఇటీవల నిర్వహించిన సర్వేలో 66 ఎకరాలు మాత్రమే ఉండగా, 6.23 ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు తేలింది.
Ì హనుమకొండ సిద్దేశ్వరస్వామి ఆలయానికి సంబంధించి రికార్డుల ప్రకారం 24.04 ఎకరాల భూమి ఉంది. సుమారు మూడేళ్ల వ్యవధిలో కొందరు ప్రైవేట్ వ్యక్తులు 2.34 ఎకరాల భూమిని కబ్జా చేశారు.
.... ఇలా గ్రేటర్ వరంగల్ నగరంలోని ఆరు దేవాలయాలకు చెందిన సుమారు 30 ఎకరాల భూమి ఆక్రమణకు గురైంది. బహిరంగ మార్కెట్‌లో ఇప్పుడా భూముల విలువ రూ.300 కోట్లకుపైనే ఉంటుందని దేవాదాయ, రెవెన్యూశాఖల అధికారుల అంచనా. గ్రేటర్ వరంగల్ చుట్టూ భూముల ధరలు పెరగడంతో అక్రమార్కులు చెరువులు, అసైన్డ్, ప్రభుత్వ భూములతోపాటు దేవాలయాల భూములనూ వదలడం లేదు. ఈ విషయం జిల్లా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల దృష్టికి సైతం వెళ్లింది. సర్వేలు నిర్వహించి ఆక్రమణ వాస్తవమేనని తేల్చి నోటీసులు ఇచ్చినా.. కబ్జాదారులు ఆ భూములను వదలడం లేదు.
లోకాయుక్తకు చేరిన వివాదం..
వరంగల్ మహానగరం, చుట్టు పక్కల ప్రాంతాల్లో గజానికి రూ.10వేలకు తక్కువ ధర లేదు. నగరంలోనైతే రూ.25 వేలు మొదలు రూ.1.50 లక్షలకుపైగా పలుకుతోంది. ఆక్రమణకు గురైన పద్మాక్షి, సిద్దేశ్వర, వీరపిచ్చమాంబ, శ్రీసిద్దేశ్వర, శ్రీరంగనాయక, వేణుగోపాలస్వామి ఆలయాల సమీపంలో గజానికి రూ.45వేల నుంచి రూ.55వేలు పలుకుతోంది. వరంగల్ నగరంలో ఐదు ఆలయాలతో పాటు వీరపిచ్చమాంబ ఆశ్రమానికి చెందిన భూ ముల ఆక్రమణపై ఫిర్యాదులు లోకాయుక్త వరకు వెళ్లాయి. లోకాయుక్త, హనుమకొండ, వరంగల్ కలెక్టర్ల ఆదేశాల మేరకు ‘కుడా’, దేవాదాయశాఖ, భూమి, కొలతల శాఖల అధికారులు సర్వే చేశారు. మొత్తం 29.39 ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు సర్వే నంబర్లతో సహా తేల్చారు. సుమారు 72మంది వరకు ఈ భూములను ఆక్రమించినట్లు తేలింది. నోటీసులకే పరిమితం కాగా.. ఆక్రమణలు మళ్లీ ఆగడం లేదు. ఈ క్రమంలో ఆక్రమణకు గురైన సుమారు 30 ఎకరాల భూమి విలువ రూ.300 కోట్ల నుంచి రూ.350 కోట్లు ఉంటుందని అంచనా. హనుమకొండ చౌరస్తా చిన్న, పెద్ద కోవెల ప్రాంతంలో ఉండే రంగనాయకస్వామి ఆలయం, బ్రాహ్మణవాడ, ములుగురోడ్, పెద్దమ్మగడ్డ ఏరియాలతో పాటు వరంగల్‌లోని వేణుగోపాలస్వామి ఆలయాల చుట్టూ ఆక్రమణలు కొనసాగుతున్నాయి.
ఆక్రమణకు గురైన శ్రీవీరపిచ్చమాంబ మఠం భూములు, వీర పిచ్చమాంబ ఆశ్రమానికి
సంబంధించిన స్థలం, అక్రమార్కుల చెరలో పద్మాక్షిగుడి స్థలం
అక్రమార్కుల చెరలో గ్రేటర్ వరంగల్ ఆలయ భూములు
కబ్జాకు గురైన భూముల విలువ రూ.300 కోట్ల పైమాటే
సర్వేలు, నోటీసులకే పరిమితం.. తక్షణ చర్యలు లేక ఆగని ఆక్రమణలు
లోకాయుక్తకు చేరిన ఆక్రమణల బాగోతం..
అక్రమార్కుల చెరలోనే ఆలయ భూములు
ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు చొరవ చూపితేనే భూములు దక్కేది

వరంగల్ కొత్తవాడలో ఆక్రమణకు గురవుతున్న శ్రీవేణుగోపాల స్వామి ఆలయ స్థలం