
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో 2010లో నియామకమైన అసిస్టెంట్ ప్రొఫెసర్లు తమకు వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం మధ్యాహ్నం వరకు రిజిస్ట్రార్ చాంబర్‌లోనే బైఠాయించి నిరసన తెలిపారు. సోమవారం సాయంత్రం రిజిస్ట్రార్ చాంబర్‌లో బైఠాయించిన అసిస్టెంట్ ప్రొఫెసర్లు రాత్రి మొత్తం అక్కడే ఉన్నారు. మంగళవారం మధ్యాహ్నం వరకు నిరసన కొనసాగింది. సెనేట్ సమావేశం ముగిశాక పాలకమండలి సభ్యులను కలిసి వినతిపత్రాలు సమర్పించారు. అంతకుముందు పాలక మండలి సభ్యుడు టి.మనోహర్ సెనేట్ సమావేశంలో ఉండగా.. అసిస్టెంట్ ప్రొఫెసర్ల నిరసన విషయం తెలిసి ఆయా అసిస్టెంట్ ప్రొఫెసర్లకు వేతనాలు చెల్లించాల వీసీని కోరారు. దీనిపై వీసీ రమేశ్ స్పందిస్తూ వీరి నియామకం వివాదాస్పదమైందని, తన చేతిలో ఏమీ లేదని తెలిపారు. వీరి వేతనాల విషయంలోనే తనపై కేసు నమోదైందని వాపోయారు. కాగా, అసిస్టెంట్ ప్రొఫెసర్ల సమస్యను అకాడమిక్ సెనేట్‌లో చర్చించడం సరికాదని, పాలకమండలి సమావేశంలో చర్చించుకోవాల్సి ఉంటుందని కేయూ మాజీ వీసీ గోపాల్‌రెడ్డి తెలిపారు.