టాస్క్‌ఫోర్స్‌ అదుపులో ఐదుగురు, రాత్రి విడుదల

కాశిబుగ్గ కార్పొరేషన్‌ సర్కిల్‌ కార్యాలయం ముందు పోలీసు వాహనాలు   - Sakshi

కార్పొరేటర్‌ భర్తతో సహా నలుగురు నేతలు

ఏనుమాముల ప్రాంతంలో పలు భూ వివాదాల్లో జోక్యం ఉన్నట్లు ఆరోపణలు వచ్చిన నేఫథ్యంలో 14వ డివిజన్‌ అధికార పార్టీ కార్పొరేటర్‌ తూర్పాటి సులోచన భర్త మాజీ జెడ్పీటీసీ తూర్పాటి సారయ్య, బాలాజీనగర్‌కు చెందిన మాజీ కారోబార్‌ తూర్పాటి రఘు, తూర్పాటి శ్రీను, సుందరయ్యనగర్‌కు చెందిన జంగం రాజు, బీఆర్‌ఎస్‌ డివిజన్‌ ప్రధాన కార్యదర్శి గండ్రతి భాస్కర్‌లను మంగళవారం ఉదయం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. దేశాయిపేటతోపాటు 14వ డివిజన్‌లోని బాలాజీనగర్‌, మధురానగర్‌, కోటిలింగాల దేవాలయం, మణికంఠకాలనీల్లోని స్థలాలను ఆక్రమించుకొని సంబంధిత యాజమానులను బెదిరింపులకు పాల్పడినట్లుగా వీరందరిపై ఏనుమాముల పోలీస్‌స్టేషన్‌లో పలు ఫిర్యాదులు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఏనుమాముల గ్రామ పంచాయతీలో ఉద్యోగిగా పని చేసిన ఓ వ్యక్తి పోస్టుకు రాజీనామా చేసి బంధువులైన అధికార పార్టీ నేత, నాయకులతో కలిసి భూదందాలపై పడినట్లుగా తెలిసింది. ఈ వ్యవహారం వర్ధన్నపేట ఎమ్మెల్యే దృష్టికి రావడంతో సదరు నేతను భూ వివాదాల్లో జోక్యం చేసుకోవద్దని బహిరంగంగా హెచ్చరించినట్లు తెలిసింది. దీనికితోడు రాష్ట్రస్థాయి ముఖ్య నేతల భూముల్లోనూ జోక్యం చేసుకోవడం వల్లే టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరి అరెస్ట్‌ విషయంపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులను వివరణ కోరగా విచారణ కోసం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు. మంగళవారం రాత్రి కాశిబుగ్గలోని గ్రేటర్‌ వరంగల్‌ సర్కిల్‌ కార్యాలయానికి మూడు పోలీసు వాహనాలు వచ్చాయి. కార్యాలయంలోని టౌన్‌ఫ్లానింగ్‌ విభాగంలో పోలీసులు భూ అక్రమణల ఆరోపణలపై క్షేత్రస్థాయిలో వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. కాగా.. అదుపులోకి తీసుకున్న ఐదుగురిని రాత్రి పోలీసులు విడుదల చేశారు. అదేవిధంగా వరంగల్‌ తూర్పునకు చెందిన మరో నలుగురు అధికార పార్టీ ప్రజాప్రతినిధుల పేర్లు ఆక్రమణలు పాల్పడే వారి జాబితాలో ఉన్నట్లుగా తెలిసింది. ఇప్పటికే ఆ స్థలాలను ఆక్రమించుకుని వారి అధికారంతో ప్రహరీలు, తాత్కాలిక షెడ్లను నిర్మించి ఇంటి నంబర్లు సైతం తీసుకున్నట్లు తెలిసింది.

Read latest Hanamkonda News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top