ప్రాధాన్యత రంగాలకు రుణాలు

- - Sakshi

వరంగల్‌ రూరల్‌: జిల్లా వార్షిక ప్రణాళికలో భాగంగా ప్రాధాన్యత రంగాలకు రూ.2,672.44కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు కలెక్టర్‌ పి.ప్రావీణ్య వెల్లడించారు. కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో జిల్లాస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం ఎల్‌డీఎం(యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా) ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో క్రెడిట్‌ డిపాజిట్‌ 119.20 శాతం ఉందని చెప్పారు. ప్రధానమంత్రి ఎంప్లాయ్‌మెంట్‌ జనరేషన్‌ ప్రోగ్రాం(పీఎంఈజీపీ)లో 67 యూనిట్లకు మంజూరు చేశామని, వీటిని మరింతగా పెంచాలని బ్యాంకర్లను ఆదేశించారు. 11,760 ముద్ర యూనిట్లకు రూ.107.13కోట్లు మంజూరు కాగా.. ఇప్పటివరకు 6,932 యూనిట్లకు రూ.26.80కోట్ల మొండి బకాయిలు(ఎన్‌పీఏ) ఉన్నాయని కలెక్టర్‌ వివరించారు. జెడ్పీ చైర్‌పర్సన్‌ గండ్ర జ్యోతి మాట్లాడుతూ బ్యాంకర్లు పంట రుణాల విషయంలో రైతులకు సహకరిస్తున్నారని చెప్పారు. జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ ఉషాదయాళ్‌ మాట్లాడుతూ బ్యాంకుల క్షేత్రస్థాయి అధికారులు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి రుణాలపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ రాజు హవేలి మాట్లాడుతూ స్వయం సహాయక మహిళా సంఘాలకు రూ.568కోట్ల రుణాలకు.. రూ.439కోట్లు ఇచ్చామని వెల్లడించారు. విద్యా రుణాలు(ఎడ్యుకేషన్‌ లోన్స్‌)కు రూ.25.04కోట్లు మంజూరు చేశామని చెప్పారు. కేసీసీ ద్వారా పశుసంవర్థక రుణాలు 2,427 దరఖాస్తులకు.. 962 మంది రైతులకు రుణాలు మంజూరు చేశామన్నారు. జీనవజ్యోతి బీమా యోజన కింద రూ.436లతో 71,242 మంది నమోదు చేసుకున్నారని ఆయన చెప్పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ అశ్విని తానాజీ వాకడే, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(యూబీఐ) రీజినల్‌ మేనేజర్‌ పి.సత్యం, కెనరా బ్యాంక్‌ రీజినల్‌ మేనేజర్‌ మాధవి, ఏపీజీవీబీ రీజినల్‌ మేనేజర్‌ శ్రీధర్‌రెడ్డి, నాబార్డు డీడీఎం రవి, ఎస్‌బీఐ రీజినల్‌ మేనేజర్‌ అనిల్‌కుమార్‌, వివిధ బ్యాంకుల మేనేజర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

బ్యాంకర్ల సమావేశంలో కలెక్టర్‌ ప్రావీణ్య

Read latest Hanamkonda News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top