ఏనుమాములలో వారిదే హవా!

- - Sakshi

వరంగల్‌: గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిఽధి 14వ డివిజన్‌ ఏనుమాముల ప్రాంతంలో దశాబ్దాల క్రితం కొన్న ప్లాట్లు పెద్ద సంఖ్యలో ఉండడంతో రెండు, మూడు గ్యాంగ్‌లుగా ఏర్పడి కొందరు కబ్జాలకు తెరలేపారు. ఓ గ్యాంగ్‌కు రాజకీయంగా పలుకుబడి ఉన్న వారి ఆశీస్సులు ఉండగా.. మిగిలిన గ్యాంగులకు రాజకీయ, సామాజిక ఉద్యమాలకు చెందిన వారు నేపథ్యం వహిస్తున్నట్లు తెలుస్తోంది. గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో విలీనం కాని సమయంలోని ఏనుమాముల గ్రామ పంచాయతీ పరిధిలో సుందరయ్యనగర్‌, బాలాజీనగర్‌, మణికంఠకాలనీ, మధురానగర్‌, లక్ష్మీగణపతి కాలనీ, సాయి గణేశ్‌నగర్‌, ఎస్‌ఆర్‌నగర్‌, గాంధీనగర్‌, ప్రతాప రుద్రకాలనీ, ముసలమ్మకుంట, చాకలి ఐలమ్మ నగర్‌ తదితర ప్రాంతాల్లో వందల ఎకరాలను ప్లాట్లు చేసి విక్రయించారు.

మధ్యతరగతి వారే ఎక్కువ..

వరంగల్‌ నగరానికి అతి సమీపంలో ఉన్నప్పటికీ లేఔట్‌ తదితర ఆంక్షలు లేక పోవడం, తక్కువ ధరలకు ప్లాట్లు లభిస్తుండడం, భవనాలు నిర్మించుకుంటే అనుమతులు సులభంగా వస్తుండడంతో వందలాది మంది ప్లాట్లను కొనుగోలు చేశారు. 200 గజాల ప్లాటు కేవలం రూ.లక్ష నుంచి రూ.2 లక్షల లోపు రావడంతో మధ్యతరగతికి చెందిన వారు ఎక్కువ మంది కొన్నారు. ఆర్థికంగా ఉన్న వారు అప్పుడు తాత్కాలికంగా ఇల్లు, షెడ్లు, ప్రహరీలు నిర్మించుకుని గ్రామ పంచాయతీ నుంచి ఇంటి నంబర్లు పొందడంతో వారు కబ్జా రాయుళ్ల నుంచి తప్పించుకున్నారు. భవిష్యత్‌లో తమ పిల్లల అవసరాలు, పెళ్లిళ్లకు అక్కరకు వస్తాయని కొనుగోలు చేసి న వారు మాత్రం ప్రస్తుతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రేటర్‌ వరంగల్‌ కార్పొరేషన్‌లో ఏనుమాముల గ్రామ పంచాయతీ విలీనం అవుతుందని తెలిసిన వారు చాలా మంది ముందస్తుగా ఇంటి నంబర్లు పొందారు. కొంత మంది కొన్నప్పటికీ స్థానికంగా లేకపోవడం వల్ల రిజిస్ట్రేషన్‌ చేసుకున్న భూమి కదా.. అనే ధీమాతో ఉన్నవారు ఇప్పుడు అష్టకష్టాలు పడుతున్నారు.

పోలీస్‌స్టేషన్ల చుట్టూ ప్రదక్షిణలు

తెలంగాణ ప్రభుత్వం కొత్తగా తెచ్చిన ధరణి పోర్టల్‌లో కాస్తు కాలంలో సైతం పట్టాదారుడి పేరు రావడంతో కబ్జా రాయుళ్ల పంట పండుతోంది. అప్పటి పట్టాదారులకు చెందిన వారసుల (హక్కుదారుల)తో ఇప్పుడు రిజిస్ట్రేషన్లు చేయించుకొని ప్లాట్లను అక్రమించుకునే పనిలో పడ్డారు. దీంతో బాధితులు తమ ప్లాట్లను ఆక్రమించుకుంటున్నారని పోలీస్‌స్టేషన్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా.. రాజకీయ నేతల ఒత్తిళ్లతో పోలీసులు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో పడిపోయినట్లుగా తెలుస్తోంది. వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌గా ఏవీ.రంగనాథ్‌ ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన వెంటనే భూకబ్జాదారులు, అక్రమణల గ్యాంగ్‌లపై దృష్టి పెట్టడంతో బాధితులు కమిషనర్‌ కార్యాలయం దారి పట్టారు. భూకబ్జాలు, అక్రమణల వల్ల ప్రభుత్వానికి సైతం అపవాదు వస్తున్నందున అధికార యంత్రాంగం చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. అందులో భాగంగానే అధికార పార్టీకి చెందిన వారైనప్పటికీ ఆక్రమణ, కబ్జాలకు పాల్పడితే చర్యలు తీసుకున్నట్లుగా సమాచారం.

కబ్జాదారులకు ఫైనాన్షియర్ల అండ

ఏనుమాముల, కోటిలింగాల గుడి ప్రాంతాల్లో కబ్జాలకు పాల్పడే గ్యాంగులకు కాశిబుగ్గకు చెందిన ఇద్దరు, ముగ్గురు ఫైనాన్సియర్లు ఆర్థికంగా సహాయం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. సుమారు రూ.కోటి విలువగల ప్లాట్లకు రూ.5 నుంచి రూ.10 లక్షలు పెట్టుబడి పెడితే వచ్చిన మొత్తంలో సగం ఫైనాన్సర్లు తీసుకుంటున్నట్లుగా విశ్వసనీయ సమాచారం. ప్లాట్‌ దక్కని పరిస్థితుల్లో సైతం పెట్టిన పెట్టుబడి గుడ్‌విల్‌ కింద వస్తేనే వదిలివేస్తున్నట్లుగా తెలిసింది. ఇందులో ఒక ఫైనాన్సర్‌ వివాదాస్పద భూములు కొనేందుకు మాత్రమే పెట్టుబడి పెడుతున్నట్లుగా తెలిసింది.

ఖాళీ జాగా కనిపిస్తే కబ్జా

పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదు చేసినా పట్టింపు శూన్యం

సీపీ దృష్టికి వెళ్లడంతో టాస్క్‌ఫోర్స్‌ రంగ ప్రవేశం

అదుపులో కార్పొరేటర్‌ భర్త, మరో నలుగురు నేతలు

పరిశీలనలో మరికొంత మంది నేతల జాబితా

Read latest Hanamkonda News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top